రీయింబర్స్‌మెంట్‌ను అడ్డుకునేందుకు ఐఏఎస్‌ల కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకుండా ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్‌లు కుట్ర పన్నుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం ఆయన సచివాలయంలో ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం సుమారు రూ.1200 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని ప్రభుత్వం చెల్లించని కారణంగా పీజీ మెడికల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు వేధిస్తున్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఇప్పట్లో డీఎస్సీ వేయబోమని ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రకటనను కృష్ణయ్య తప్పుపట్టారు. పంతుళ్లు లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతుంటే డీఎస్సీ ఎందుకు వేయరని ఆయన ప్రశ్నించారు.