ప్రజల పక్షాన పోరాడుతా: ఆర్.కృష్ణయ్య
మన్సూరాబాద్, న్యూస్‌లైన్: శాసనసభలో నాయకుడిగా అసెంబ్లీ బయట ఉద్యమ నాయకుడిగా దమ్మున్న నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడుతానని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ ఎల్‌బీనగర్ వార్డు కార్యాలయం నుంచి ఎల్‌బీనగర్ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ర్టంలో లక్షా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇళ్లులేని పేదలకు 125 గజాల స్థలం, రూ.3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన ఎన్నికల హామీని నేరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. డ్వాక్రా, రైతు రుణాల మాఫీకి ప్రభుత్వంపై పోరాడుతానని తెలిపారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో పౌర సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, ఇళ్ల పట్టాలు లాంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఎల్‌బీనగర్‌లో రోడ్లపై తోపుడుబండ్లు పెట్టుకుని జీవనం సాగించే చిరువ్యాపారులపై పోలీసుల వేధింపులు లేకుండా పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తానని స్పష్టం చేశారు.
ఎల్‌బీనగర్ తోపుడు బండ్ల అధ్యక్షుడు మల్లేష్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ర్ట కార్యనిర్వహక కార్యదర్శి సామ రంగారెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల లతానర్సింహ్మరెడ్డి, నాయకులు మల్లారపు శ్రీనివాసరావు, నాంపల్లి శంకరయ్య, విశ్వేశ్వర్‌రావు, ఎగమయ్య, యంజాల జగన్, గుండె గిరిబాబు, రాము, కాసాని అశోక్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.