కేసీఆర్.. అడ్డొస్తే సైకిల్‌తో తొక్కేస్తాం: చ్రందబాబు
- తుపాకులకే భయపడలేదు.. నువ్వో లెక్కా?
- టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్.కృష్ణయ్యే సీఎం
- ఆదిలాబాద్ సభల్లో చంద్రబాబునాయుడు
- టీడీపీ అధినేతపై కోడిగుడ్లతో తెలంగాణవాదుల దాడి
సాక్షి, మంచిర్యాల : ‘తుపాకులకే భయపడలేదు.. తాగుబోతులను పంపించి సభలో గొడవపెట్టిస్తే భయపడిపోతానా.. కేసీఆర్ ఓ లెక్కా నాకు? ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. సైకిల్‌తో తొక్కేస్తాం..’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్యను తొలి ముఖ్యమంత్రిని చేస్తానని, దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, కడెం, నిర్మల్‌లలో ఏర్పాటు చేసిన సభల్లో చంద్రబాబు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ దొంగలు, తాగుబోతుల పార్టీ.. వాళ్లను తరిమికొట్టాలన్నారు. పెత్తందారీ, భూస్వామి పోకడలు ఉన్న కేసీఆర్ మళ్లీ నీ బాంచన్ కాల్మోక్త దొరా అనే రోజులు రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కొడుకు, కూతురు, అల్లుడు, బంధువులను పోటీలో నిలబెట్టి కుటుంబ పాలన సాగిస్తున్నాడన్నారు. అమరుల బలిదానం వల్లనే తెలంగాణ వచ్చింది తప్ప.. కేసీఆర్ సాధించింది ఏమీ లేదని తెలిపారు. కుటుంబ సభ్యులు కానివారికి పార్టీ టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు తోడుదొంగలుగా మారారని మండిపడ్డారు. టీడీపీ సభల్లో గొడవలు పెట్టిస్తున్నారని చెప్పారు. ఈ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని పేర్కొన్నారు. ‘ఇలాగే దాడులు చేయిస్తే కేసీఆర్ గుండెల్లో నిద్రపోతా... ఎన్నికల తర్వాత ఆయన శాశ్వతంగా ఫాంహౌస్‌లోనే పడుకునే రోజులు వస్తాయి’ అని హెచ్చరించారు.. బెల్లంపల్లిలో ఉదయం 10.30 గంటలకు సభలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు.
సభలో కోడిగుడ్లతో దాడి
చంద్రబాబుకు బెల్లంపల్లి సభలో తెలంగాణవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొందరు చంద్రబాబుపై కోడిగుడ్లు విసిరే ప్రయత్నం చేశారు. సదరు యువకులు విసిరిన కోడిగుడ్లు చంద్రబాబుకు ఐదు మీటర్ల దూరంలో సభావేదిక ముందు పడ్డాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు తెలంగాణవాదులను వెంటనే అదుపులోకి తీసుకొని సభాస్థలి నుంచి బయటకు తీసుకెళ్లారు. మరో వ్యక్తి చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకోబోగా పోలీసులు అతన్ని కూడా బలవంతంగా లాకెళ్లారు. లాఠీలకు పని చెప్పారు. కాగా, ముందుజాగ్రత్తగా పోలీసులు ఏడుగురు టీఆర్‌ఎస్, మరో ఆరుగురు టీ జేఏసీ, కుల సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని సభ ముగిసిన తర్వాత విడిచిపెట్టారు.