ఇంటికో ఉద్యోగం ఎటుబోయింది ?
Published Sat, Nov 8 2014 1:21 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
హైదరాబాద్: ఇంటికొక ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగుల ఊసెత్తకపోవడం అత్యంత దారుణమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా వచ్చిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బడ్జెట్‌లో నిరుద్యోగులకోసం, స్వయం ఉపాధి పథకాలకు కేటాయింపులు జరగలేదని తెలిపారు.
ఇంటికొక ఉద్యోగం ఇచ్చే వరకు మంత్రుల వెంటపడతామని అందుకు నిరుద్యోగ యువత సిద్ధమవుతున్నారన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని అనేక మంది తమ ప్రాణాలను అర్పించారని కానీ ఉద్యోగాలు రాలేదన్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమంటే ఐదుమంది మంత్రులు పని చేయడం కాదని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పనులు పూర్తిగా అగిపోయాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మరో మహా పోరాటం జరుగక తప్పదని తర్వలో లక్షాలది మందితో నిజాం కాలేజీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Advertisement