అన్ని లెక్కలున్నా బీసీలపై అధ్యయనం ఎందుకు?
- ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో బీసీ జనాభా కులాల వారీగా స్పష్టంగా తెలిసినా, రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ కమిషన్ ద్వారా ఆరు నెలలపాటు అధ్యయనం చేయిస్తామనడంలో అర్థం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. సమగ్ర సర్వేలో బీసీల స్థితిగతులు, సామాజిక, ఆర్థిక, విద్య పరిస్థితిపై సమగ్ర వివరాలు తేలాయని, వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచొచ్చని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రటకనలో పేర్కొన్నారు.
అధ్యయనం పేరిట కాలయాపన చేయడం తప్ప పెద్దగా ఒరిగేదేంలేదని కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52శాతం ఉందని, ఆమేరకు నెలరోజుల్లో రిజర్వేషన్లు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల పెంపులో ఎలాంటి అధ్యయనం లేకుండా, అతి తక్కువ వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం... బీసీ రిజర్వేషన్ల పెంపులో మాత్రం ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడంలేదన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగం, పదోన్నతులు, రాజకీయాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు.