పార్టీలన్నీ బీసీలకు 150 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లివ్వాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో బీసీలకు 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలను అన్ని పార్టీలు కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ‘అగ్రకులాలు ఇన్నాళ్లూ వారి వాటాతో పాటు మా వాటా కూడా తిన్నారు. మేం బిచ్చం అడగడం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కునే అడుగుతున్నాం. బీసీలు తిరుగుబాటు చేయకముందే, వారు మిలిటెంట్లుగా కాకముందే మా వాటా ప్రకటించాలి’ అని పేర్కొన్నారు. వచ్చే నెల 15న నిజాంకాలేజీ మైదానంలో నిర్వహించనున్న ‘బీసీల సింహగర్జన’ వాల్‌పోస్టర్, నూతన బీసీ జెండాను శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కృష్ణయ్య ఆవిష్కరించి మాట్లాడారు. సభకు పార్టీలకతీతంగా ‘ఇంటికో మనిషి, ఊరుకో బండి’ చొప్పున బీసీలు హాజరు కావాలని కోరారు. ఈ మహాసభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నరేంద్రమోడీ, సిద్ధరామయ్య, అఖిలేశ్‌యాదవ్, నితీశ్‌కుమార్‌లతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
బీసీలకు ‘కొత్త జెండా’: మూడున్నర దశాబ్దాలుగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కొత్త జెండాను రూపొందించుకుంది. కుల, వర్గ పోరాటాలకు ప్రతీకగా నిలిచేలా ఎరుపు, ఆకాశనీలం రంగులతో ఏర్పాటైన ఈ జెండాలో బీసీ అని ఇంగ్లీషులో రాశారు. చుట్టూ ఆకులతో కూడిన చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎరుపు వర్గపోరాటాలకు, ఆకాశనీలం రంగు కుల పోరాటానికి చిహ్నాలని ఆర్.కృష్ణయ్య తెలిపారు.
తిరగబడకముందే.. మా వాటా ఇవ్వండి
Published Sat, Nov 16 2013 3:05 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement