
బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య శనివారం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.
సాక్షి, హైదరాబాద్: బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య శనివారం లోటస్‌పాండ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆర్. కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్‌పై చట్టసభల్లో చర్చ జరపాలని వైఎస్ జగన్‌ను కోరినట్టు తెలిపారు. 14 పేజీలతో కూడిన వినతిపత్రం ఆయనకు ఇచ్చినట్టు వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్ గురించి మొట్టమొదటిగా ప్రైవేట్ బిల్లు పెట్టినందుకు వైఎస్ జగన్‌ను అభినందించినట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో తమ పార్టీ తరపున లేవనెత్తుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. బీసీల కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ఎంతో కృషి చేశారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఈ నెల 17న ఏలూరులో నిర్వహించనున్న బీసీ గర్జన సభకు రమ్మని తనను వైఎస్ జగన్ ఆహ్వానించారని చెప్పారు. బీసీల కోసం ఎక్కడ సభ పెట్టినా, ఏ పార్టీ సభ నిర్వహించినా వెళ్తానని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు.