బడుగులకు మేలు చేస్తే సహించరా? | YS Jagan Mohan Reddy Fires On TDP In Assembly | Sakshi
Sakshi News home page

బడుగులకు మేలు చేస్తే సహించరా?

Published Wed, Jul 24 2019 3:26 AM | Last Updated on Wed, Jul 24 2019 3:29 AM

YS Jagan Mohan Reddy Fires On TDP In Assembly - Sakshi

అసెంబ్లీలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మోసం చేయడం, అబద్ధాలాడటం మా ఇంటా వంటా లేదని మరోసారి చెబుతున్నా. ఎన్నికలకు వెళ్లే ముందు మా ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాం. దానికి ఓటేయమని అడిగాం. మా మేనిఫెస్టో చూశాకే ప్రజలు మాకు ఓటేశారని గర్వంగా తలెత్తుకుని చెబుతున్నాం. జగన్‌ అనే నేను ఎన్నికలప్పుడు ఏం మాట్లాడానో ఇక్కడ స్క్రీన్‌పై చూపిస్తాను. చూసిన తర్వాత మీకు (ప్రతిపక్షానికి) మనస్సాక్షి అనేది ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పండని అడుగుతున్నా.                        
– సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతే ఎలా? అని ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్గాలకు ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చీ రావడంతోనే వాళ్ల కోసం అనేక పనులు చేస్తుంటే భరించలేకపోతున్నారని మండిపడ్డారు. బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించిన చట్టాలు చేస్తుంటే దుర్బుద్ధితో సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారమే వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని, అయినా రాద్ధాంతం చేయడంలో అర్థమేంటని నిలదీశారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు వేసిన ఓ ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి బదులిచ్చారు. అయినా ప్రతిపక్ష సభ్యులు శాంతించక.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్‌ ఇవ్వాలనే డిమాండ్‌తో సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళం సృష్టించేందుకు యత్నించారు. ఈ దశలో సీఎం వైఎస్‌ జగన్‌ సభకు వాస్తవాలను వివరించారు. ఈ సందర్భంగా తాను పాదయాత్రలో చేసిన ప్రసంగాల వీడియోలను సభలో ప్రదర్శించారు.

పాదయాత్రలో అన్నది ఇదీ..
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కె కోటపాడు వద్ద 2018 సెప్టెంబర్‌ 3వ తేదీన వైఎస్‌ జగన్‌ మాట్లాడిన మాటలను సభలో ప్రదర్శించారు. అందులో ‘ప్రతి అక్కా, చెల్లెమ్మ లక్షాధికారి కావాలి. సంతోషంగా ఉండాలనేది నాన్నగారి స్వప్నం. వాళ్లు సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది.. రాష్ట్రం బాగుంటుందని నమ్మే వాళ్లల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. వాళ్ల కోసం నేను చేయబోయే కార్యక్రమం వైఎస్సార్‌ చేయూత. ఇంతకు ముందు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కల పరిస్థితి గురించి చెప్పాను. ఏదైనా జ్వరమొచ్చి ఒక్క వారం పనులకు పోలేకపోతే వాళ్లు పస్తులు పడుకునే దుస్థితి. ఇలాంటి వాళ్లకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వాలని అప్పట్లో నేను చెబితే  వెటకారం చేశారు. ఈ సూచనను కూడా పరిగణనలోనికి తీసుకుని వైఎస్సార్‌ చేయూత అనే కొత్త పథకానికి నాంది పలుకుతున్నాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కల కుటుంబానికి అక్షరాల రూ.75 వేలు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నాను. ప్రభుత్వం రెండో సంవత్సరం నుంచి దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా, పూర్తి పారదర్శకతతో ఎలాంటి లంచాలకు తావు లేకుండా, ప్రతీ అక్కకు అందేట్టుగా చేస్తామని హామీ ఇస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 


దుర్బుద్ధితో వక్రీకరణ
తాను పాదయాత్రలో చేసిన ప్రసంగాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు దుర్బుద్ధితో వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ‘అర్థం చేసుకోవాలనే ఆలోచన లేనప్పుడు, ఒక విషయం స్పష్టంగా తెలిసినా వక్రీకరించాలనే దుర్బుద్ధి ఉన్నప్పుడు, సహజంగా వీళ్లకొచ్చే మాటలు మంచి మనసుతో రానప్పుడు వక్రీకరణే కనిపిస్తుంది. ద్వంద్వ విధానాలు, దుర్బుద్ధితో వీళ్లు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది’ అని అంతకు ముందు ప్రదర్శించిన వీడియోను మరోసారి సభలో ప్రదర్శించారు. 

ఎందుకు మార్చామో ప్రతీ సభలో చెప్పా
రాజకీయ స్వార్థంతోనే టీడీపీ తన ప్రసంగాన్ని వక్రీకరిస్తోందని జగన్‌ అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామన్నప్పుడు టీడీపీ ఏమన్నదో, దాంతో తాము ఎలాంటి మార్పు చేయాల్సి వచ్చిందో సభకు వివరించారు. ‘మేము ఇంత స్పష్టంగా చెప్పాం. ఎక్కడా వక్రీకరించడానికి కూడా తావులేదు. అయినా వక్రీకరించడం కోసం ఏకంగా సభా సమయాన్ని పూర్తిగా వృధా చేస్తున్నారు. ఎలాంటి చర్చకు తావు లేకుండా, రాజకీయ లబ్ధి కోసం స్వార్థంగా ఆలోచించే చంద్రబాబు సభలో ఉండటం బాధపడాల్సిన అంశం’ అన్నారు. అప్పటి వరకు ప్రభుత్వాన్ని తప్పుబడుతూ చంద్రబాబు చూపిస్తున్న పేపర్‌ క్లిప్పింగ్‌ను జగన్‌ తన వద్దకు తెప్పించుకుని వివరణ ఇచ్చారు. ‘చంద్రబాబు ఇచ్చిన పేపర్‌ (చూపిస్తూ) 2017 అక్టోబర్‌ 18వ తేదీకి సంబంధించిన అంశం.

ఆ తర్వాత 2018 సెప్టెంబర్‌ 3న మాడుగుల నియోజకవర్గం కె. కోటపాడు మండలంలో వైఎస్సార్‌ చేయూత అనే పథకాన్ని ప్రకటించాం. అది ఏ నేపథ్యంలో, ఎందుకు లాంచ్‌ చేశామనేది పాదయాత్ర జరుగుతుండగా, ప్రజల సమక్షంలోనే ఎలాంటి పరిస్థితుల్లో పథకాన్ని మారుస్తున్నామో వివరంగా చెప్పాం. ఈ ఒక్క మీటింగ్‌లోనే కాదు, ఆ తర్వాత దాదాపు పది మీటింగుల్లో ఈ పథకం ఎలా మార్చామన్నది చెప్పాను. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పాదయాత్ర జరుగుతుండగానే పదిసార్లు చెప్పి ఉంటా. రెండు నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారంలో పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా సార్లు చెప్పాం’ అని సభకు తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్రలో వైఎస్సార్‌ ఆసరాకు సంబంధించి తాను చేసిన ప్రసంగం వీడియోను మరోసారి సభలో ప్రదర్శించారు. 

మేనిఫెస్టోలో పెట్టి ఓట్లడిగాం
‘ఇదిగో.. ఈ మేనిఫెస్టో (చూపిస్తూ) తీసుకెళ్లి ప్రజలను ఓట్లడిగాం. వాళ్లు ఓట్లేశారు. వాళ్లు (టీడీపీ) అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. వాళ్లకు మంచి చేయాలన్న ఆలోచన ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడుకు ఏనాడూ రాలేదు. మేం అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఆలోచన చేశాం. మొట్టమొదటి శాసనసభలోనే చట్టాలను తీసుకొస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి చేసేందుకు అడుగులేస్తున్నాం. నామినేషన్‌ పదవుల్లోనే కాదు, నామినేషన్‌ పనుల్లో కూడా వాళ్లకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. నామినేట్‌ పదవుల్లో, నామినేటెడ్‌ కాంట్రాక్టు వర్కుల్లో మహిళలకు సంబంధించి 50 శాతం రిజర్వేషన్‌ ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం. శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటుకు బిల్లు కూడా పెట్టాం. పిల్లలకు ఉద్యోగాలు దొరక్క అల్లాడిపోతున్నారు. అందుకే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించాం.

ఈ పెద్దమనిషి (చంద్రబాబు) ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడూ పిల్లల గురించి ఆలోచించలేదు. వాళ్ల ఉద్యోగావకాశాల గురించి, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించి ఏనాడూ ఆలోచించలేదు. పిల్లలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వచ్చిన వెంటనే బిల్లులు తీసుకొస్తే, వాటి ద్వారా ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దుర్బుద్దితో సభను అడ్డుకుంటున్నార’ని జగన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం ఒకే ఒక్కఅంశం మీద సభను గంటన్నర సేపు అడ్డుకున్నారని, ఇకనైనా సభను ముందుకు తీసుకెళ్లాలని స్పీకర్‌ను కోరారు. ప్రశ్నోత్తరాల సమయం దాటిపోవడంతో, బిల్లుల మీద చర్చ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement