
అలోక్‌రెడ్డి కుటుంబసభ్యులకు నేతల పరామర్శ
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ అలోక్ రెడ్డి కుటుంబసభ్యులను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎల్బీనగర్ శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ నేత మల్లు రవి పరామర్శించారు. చైతన్యపురి లోని ఇంద్రానగర్ కాలనీలోని నివాసం ఉంటున్న అలోక్ తల్లిదండ్రులను నేతలు ఆదివారం కలిశారు.
ప్రభుత్వ తరుపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని, అధైర్య పడవద్దని వారికి కేంద్రమంత్రి భరోసానిచ్చారు. అమెరికాలో ఇటీవల మరణించిన తెలుగు వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విదేశాల్లో ఉంటున్న ప్రతి భారతీయుడికి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి కాన్సులేట్ అధికారులతో విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోందని దత్తాత్రేయ తెలిపారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని స‍్వయంగా తెలుసుకునేందుకు ఆదివారం అమెరికా వెళ్తున్నట్లు అలోక్ రెడ్డి తల్లిదండ్రులు తెలిపారు.