టర్బైన్ కాంక్రీట్ పనులను పరిశీలిస్తున్న జెన్‌కో డైరెక్టర్ రాధాకృష్ణ
పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను గురువారం జెన్‌కో డైరెక్టర్ («ప్రాజెక్ట్స్) సి.రాధాకృష్ణ పరిశీలించారు. పవర్ మెక్ సంస్థ నిర్మిస్తున్న టర్బైన్, జనరేటర్ డెక్ క్యాస్టింగ్ కాంక్రీట్ పనులను ప్రారంభించారు. తెల్లవారుజామున ఐదు గంటలకే పని ప్రదేశానికి చేరుకుని పూజాకార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం, 1100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ప్రారంభించారు. అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ .. కర్మాగారంలో కీలకమైన టర్బైన్, జనరేటర్ కాంక్రీట్ పనులను 24 గంటల్లో పూర్తిచేస్తామన్నారు. ఆ తరువాత ఎలక్ట్రికల్ పనులు చేపడతామన్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రణాళికాబద్ధగా పనులు సాగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జెన్‌కో సీఈ (సివిల్) అజయ్, కేటీపీఎస్ ఓ అండ్ ఎం సీఈ వి.మంగేష్‌కుమార్; 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, ఎస్‌ఈలు యుగపతి, బాలరాజు, ఉపేందర్, శ్రీనివాస్, డీఈ చంద్రశేఖర్, సేఫ్టీ ఆఫీసర్ శాంతయ్య, పవర్ మెక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం, డీజీఎం ఆనంద్, సీనియర్ మేనేజర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.