అమెరికన్ కాన్సులేట్ అధికారులతో కేటీఆర్ భేటీ
హైదరాబాద్: అమెరికా దౌత్యకార్యాలయం(కాన్సులేట్) అధికారులతో తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. ఇటీవల అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ప్రభుత్వం తిప్పిపంపిన అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. వీసాలు ఇచ్చేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలని కాన్సులేటు అధికారులను ఆయన ఈ సందర్భంగా కోరినట్టు తెలిసింది.
దాంతో సమస్య వచ్చిన మాట వాస్తవమేనని కాన్సులేట్ అధికారులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒక హైదరాబాద్ విద్యార్థులకే సమస్య రాలేదని.. వారికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కోరినట్టు కేటీఆర్ చెప్పారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాన్సులేట్ అధికారులు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, విద్యార్థుల సమస్యలపై విదేశాంగ శాఖకు లేఖ రాస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.