స్డేడియం నిర్మాణం కోసం 2001లో సీఎం చంద్రబాబునాయుడు కుప్పంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకం.
రెండేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం
పంచాయతీలో పూర్తిగా అటకెక్కిన అభివృద్ధి
రాజీనామా బాటలో 16 మంది టీడీపీ వార్డు సభ్యులు
సీఎం పేరు చెప్పేందుకే సిగ్గు పడుతున్న జనం
కుప్పం. ఈ పేరు వినగానే వెంటనే స్ఫురించే పేరు చంద్రబాబునాయుడు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు మాత్రమే కాకుండా సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రత్యేకంగా చెప్పాలంటే జిల్లా వాసి కూడా. తమ ఎమ్మెల్యే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో నియోజకవర్గ ప్రజలంతా కొద్దోగొప్పో సంతోషపడి ఉంటారు. ఎందుకంటే.. ఊళ్లు బాగుపడతాయనీ, ప్రజలకు మెరుగైన సదుపాయాలు లభిస్తాయని. కానీ నేడు ఆ పరిస్థితి మాత్రం కానరావడం లేదు. పొద్దస్తమానం రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పే చంద్రబాబుకు అభివృద్ధికి దూరమైన కుప్పం కానరావడం లేదు.
తిరుపతి : కుప్పం కుమిలిపోతుంది. అభివృద్ధికి దూరమై అల్లాడుతోంది. నిధుల లోపంతో నీరసించిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రెండేళ్లుగా అక్కడ అభివృద్ధి అటకెక్కింది. ఎటు చూసినా పాడైన రోడ్లు, ముందుకు కదలని మురుగు, దుర్వాసన వెదజల్లే పరిసరాలు. తాగునీటి ఇక్కట్లు, విద్యుత్ కోతలు, అద్దె భవనాల అగచాట్లు ఇక్కడ సర్వసాధారణం. రెండేళ్ల కాలంలో ఐదు పర్యాయాలు కుప్పం వెళ్లిన సీఎం చంద్రబాబు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అయితే ఇందులో ఏ ఒక్కటీ పూర్తయిన దాఖలాలు లేవు. పదిహేనేళ్ల కిందట స్టేడియం నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ ఆ పనులు ప్రారంభం కాలేదు. దీనికి రెండోసారి కూడా శంకుస్థాపన చేశారు. అయినా పనులు ముందడుగు వేయలేదు. కుప్పం నడిబొడ్డున నిర్మించాల్సిన అండర్ రైల్వేబ్రిడ్జి పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
దీంతో ఇక్కడ పెద్దఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రభుత్వ భవనాలన్నీ పురాతన భవనాల్లో నడుస్తున్నాయి. మరికొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాలపై దృష్టి పెట్టిన దాఖలాలే లేవు. పంచాయతీలో రోడ్లన్నీ కంకర తేలిన రాళ్లు దర్శనమిస్తున్నాయి. డంపింగ్ యార్డు లేకపోవడంతో ఇక్కడున్న శ్మశానాన్నే యార్డుగా మార్చేశారు. నియోజకవర్గంలోని సుమారు 40 గ్రామాల్లో మంచినీటి సమస్య ఏర్పడింది. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. శాశ్వత పరిష్కారానికి తీసుకున్న చర్యలేమీ లేవు. పదేళ్లుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నా ఫలితం లేకుండా పోయింది. పట్టణంలో పాతపేట నుంచి రైల్వే గేటు వరకూ ఉన్న ఇరుకు రోడ్లను విస్తరించే పనులు ఏళ్ల నాటి నుంచి మొదలు కాలేదు.
2001 ప్రాంతంలో తంబిగానిపల్లె వద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంతపు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటివరకూ అక్కడ పరిశ్రమలు పెట్టిందే లేదు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు ఉపాధి కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో సమస్యలు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నాయి. శంకుస్థాపన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయే గానీ, పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
కుప్పం పంచాయతీలో రాజకీయ ముసలం
కుప్పం పంచాయతీలో రాజకీయ ముసలం పుట్టింది. పంచాయతీలో అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల వినియోగం, జమా ఖర్చుల విషయంలో సర్పంచ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అభివృద్ధిని విస్మరిస్తున్నారన్న కారణంతో అధికార పార్టీకి చెందిన 16 మంది వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా పత్రాలతో వీరు శనివారం కలెక్టర్‌ను కలిశారు. ఆగస్టు 4న తానే స్వయంగా పంచాయతీకి వచ్చి సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వార్డు సభ్యులు శాంతించారు. అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యులే రాజీనామాకు సిద్ధమయ్యారంటే, అక్కడ అభివృద్ధి ఏమేరకు ఉందో అర్థమవుతుంది.