భాగ్యనగర్ కాలనీ : గుట్టుచప్పుడు కాకుండా లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లడమే కాకుండా.. ఆ ఫోన్‌లో ఉన్న యువతుల నెంబర్లకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న ఓ యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. గురువారం సీఐ కుషాల్‌కర్ తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన సిలివేరి సంతోష్ కుమార్ (19) బోరబండ పరిధిలోని పర్వత్‌నగర్‌లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను కొంతకాలంగా కేపీహెచ్‌బీ కాలనీ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని లేడీస్ హాస్టళ్లలో రాత్రి పూట చొరబడి..
బ్యాటరీ చార్జింగ్ కోసం కిటికీలో పెట్టిన సెల్‌ఫోన్లు తస్కరిస్తున్నాడు. హాస్టల్‌లో చొరబడ్డ ఇతడిని యువతులెవరైనా గమనించి ఎవరు నీవని ప్రశ్నిస్తే.. అసభ్యంగా మాట్లాడడమే కాకుండా... నగ్నంగా ఫొటోలు తీసి నెట్‌లో పెడతానని బెదిరించి పారిపోతాడు. గతనెల 19న కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో ఉన్న శ్రీకమల లేడీస్ హాస్టల్లోన ఒక గదిలో ఓ యువతి నిద్రపోయింది. చార్జింగ్ పెట్టిన ఆమె సెల్‌ఫోన్‌ను సంతోష్‌కుమార్ దొంగిలించాడు. అలికిడికి మేల్కొన్న ఆ యువతి సంతోష్‌ను చూసి బిగ్గరగా అరవడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ చూపించి చంపేస్తానని బెదిరించాడు.
అంతటితో ఆగకుండా ఆ ఫోన్‌లో ఉన్న ఆమె నెంబర్లను గుర్తించి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా... హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సంతోష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. హాస్టళ్లలో సెల్‌ఫోన్లు దొంగిలించడంతో పాటు యువతులకు ఫోన్ చేసి వేధిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి 8 సెల్‌ఫోన్లు, 2 మెమొరీకార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నిర్భయతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్‌ఐ విజయ్‌కుమార్, క్రైమ్ ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.