celphone theft
-
మోండాలో సెల్‌ఫోన్ దొంగల హల్చల్.. సీసీ కెమెరాలో రికార్డు
సాక్షి, బన్సీలాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మార్కెట్‌కు వివిధ రకాల కొనుగోళ్ల కోసం వచ్చేవారి సెల్ఫోన్లను దొంగలు తస్కరిస్తున్నారు. కనురెప్పపాటులో ఫోన్లు మాయం అవుతున్నాయి. ఇటీవల వినాయకచవితి సందర్భంగా మార్కెట్‌కు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రాకతో మార్కెట్ జన సంద్రంగా మారింది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటే దొంగలు మరో వైపు తమ పని కానిచ్చేశారు. ► బోయిగూడ కట్టెలమండి ప్రాంత నివాసి పాకాల రమేష్ మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తుండగా దొంగ పూలు కొంటున్నట్టు నటిస్తూ రమేష్ షర్ట్ జేబులో ఉన్న విలువైన సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ► సదరు దొంగ వ్యూహాత్మకంగా వచ్చి సంచి అడ్డుగా పెట్టి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అదే రోజు మరో ఇద్దరి సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మోండా మార్కెట్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ రైళ్లలో ఇట్టే మాయమవుతున్నారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు ►నిత్యం వేలాది మంది ప్రజల రాకపోకలు...వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటే మోండా మార్కెట్లో పోలీసు నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొంగలు అడ్డూఅదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ►మోండా మార్కెట్లో కనీసం పండగ వేళల్లో అయినా పోలీసు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తే జాగ్రత్తగా ఉంటారని పలువురు సాక్షితో వాపోయారు. ► మోండా మార్కెట్‌కు వచ్చిన అనేకమంది డబ్బు, సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ► ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. గట్టి నిఘా : క్రైమ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మోండా మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో సివిల్‌డ్రెస్‌లో పోలీసు సిబ్బందిని ఉంచాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం మార్కెట్‌కు వచ్చేటప్పుడు ప్రజలు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదు. చదవండి: షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు -
లేడీస్ హాస్టళ్లే అతడి టార్గెట్
భాగ్యనగర్ కాలనీ : గుట్టుచప్పుడు కాకుండా లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి సెల్ఫోన్లు ఎత్తుకెళ్లడమే కాకుండా.. ఆ ఫోన్లో ఉన్న యువతుల నెంబర్లకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న ఓ యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. గురువారం సీఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన సిలివేరి సంతోష్ కుమార్ (19) బోరబండ పరిధిలోని పర్వత్‌నగర్‌లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను కొంతకాలంగా కేపీహెచ్‌బీ కాలనీ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని లేడీస్ హాస్టళ్లలో రాత్రి పూట చొరబడి.. బ్యాటరీ చార్జింగ్ కోసం కిటికీలో పెట్టిన సెల్ఫోన్లు తస్కరిస్తున్నాడు. హాస్టల్లో చొరబడ్డ ఇతడిని యువతులెవరైనా గమనించి ఎవరు నీవని ప్రశ్నిస్తే.. అసభ్యంగా మాట్లాడడమే కాకుండా... నగ్నంగా ఫొటోలు తీసి నెట్లో పెడతానని బెదిరించి పారిపోతాడు. గతనెల 19న కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో ఉన్న శ్రీకమల లేడీస్ హాస్టల్లోన ఒక గదిలో ఓ యువతి నిద్రపోయింది. చార్జింగ్ పెట్టిన ఆమె సెల్‌ఫోన్‌ను సంతోష్‌కుమార్ దొంగిలించాడు. అలికిడికి మేల్కొన్న ఆ యువతి సంతోష్‌ను చూసి బిగ్గరగా అరవడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ చూపించి చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోన్లో ఉన్న ఆమె నెంబర్లను గుర్తించి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా... హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సంతోష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. హాస్టళ్లలో సెల్ఫోన్లు దొంగిలించడంతో పాటు యువతులకు ఫోన్ చేసి వేధిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి 8 సెల్ఫోన్లు, 2 మెమొరీకార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నిర్భయతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్ఐ విజయ్‌కుమార్, క్రైమ్ ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.