బెండ.. ఎంతో అండ | ladyfingers crop.. profitable | Sakshi
Sakshi News home page

బెండ.. ఎంతో అండ

Published Sun, Sep 4 2016 9:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

గజ్వేల్‌ ప్రాంతంలో బెండ సాగు

గజ్వేల్‌ ప్రాంతంలో బెండ సాగు

  • సాగుతో బోలెడు లాభాలు
  • మంచి ఫలితాలను సాధిస్తున్న రైతులు
  • జిల్లాలో పెరుగుతున్న విస్తీర్ణం
  • గజ్వేల్‌ ఉద్యాన శాఖాధికారి చక్రపాణి సలహాలు, సూచనలు
  • గజ్వేల్‌: బెండసాగుతో రైతులు మంచి ఫలితాలు పొందుతున్నారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు కురగాయల సాగువైపు మళ్లుతుండగా.. ఇందులో బెండ కీలకమైనదిగా మారుతున్నది. ఈ పంట సాగు విస్తీర్ణం రోజురోజూకు పెరుగుతున్నది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అనుకున్న ఆదాయం పొందవచ్చని గజ్వేల్‌ ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి (8374449345) తెలిపారు. ఈ పంట సాగుకు సంబంధించి సలహాలు, సూచనలు అందించారు.

    వాతావరణం
    వేడి వాతావరణం అనుకూలం. అతిచల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడమే శ్రేయస్కరం.

    విత్తన మోతాదు
    వర్షాకాలపు పంటకు ఎకరానికి 4-6 కిలోలు, వేసవి పంటకు 7-8కిలోలు, సంకరజాతి రకాలైతే 2-2.5 కిలోల విత్తనం సరిపోతుంది.

    విత్తన రకాలు
    పర్బనిక్రాంతి: కొమ్మలు వేయకుండా మొక్క బలంగా పెరుగుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చరంగులో ఉంటాయి. ఎకరాకు 4,  4.5 టన్నుల దిగుబడి వస్తుంది.
    అర్కఅనామిక: విత్తిన 55రోజుల్లో కాపుకు వస్తుంది. శంఖు రోగాన్ని కొంతవరకు తట్టుకోగలదు. కాయలు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. ఈ రకం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడు వస్తుంది.
    అర్కఅభయా: అర్కఅనామిక రకాన్ని పోలివుండి శంఖు రోగాన్ని బాగా తట్టుకుంటుంది. ఈ రకం ఎకరాకు 4-5 టన్నుల దిగుబడిని ఇచ్చే అవకాశముంది. ఈ రకాలతో 90 రోజుల్లోపు పంట చేతికి వస్తుంది. ఇవే కాకుండా సంకరజాతికి చెందిన వర్ష, విజయ్, విశాల్, నా«ద్‌శోభ, మహికో హైబ్రిడ్‌ 10, 64, ప్రియా, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, మిస్టిక్, యూఎన్‌ 7109, తులసి తదితర రకాలు కూడా సాగుచేసుకోవచ్చు.

    విత్తే పద్ధతి
    నేలను 4-5సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60సె.మీల ఎడంతో బోదెల మీద 30సెం.మీ దూరంలో విత్తుకోవాలి. వేసవికాలం పంటలో నేలను మళ్లుగా చేసి వరుసల మధ్య 45సెం.మీ, మొక్కల మధ్య 15-20 సెం.మీ దూరం ఉండేట్లు విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి తర్వాత 4-5 రోజులకు రెండో తడి నీరు ఇవ్వాలి.

    విత్తన శుద్ధి
    కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్, 4గ్రా.ల ట్రైకోడెర్మావిరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి.

    ఎరువులు
    చివరి దుక్కిలో ఎకరాకు 6-8టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి.
    24కిలోల భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 45 కిలోల నత్రజని ఎరువును మూడు సమభాగాలుగా చేసి 1/3వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/3వంతును రెండు భాగాలుగా విత్తిన 30, 45వ రోజున వేయాలి. సంకరజాతి రకాలకు ఎరువుల మోతాదును సుమారు 50శాతం పెంచాలి.

    కలుపు నివారణ, అంతర కృషి
    పెండిమిథాలిన్‌ 30శాతం ఎకరాకు 1.2లీటర్‌ చొప్పున విత్తిన వెంటనే గానీ, మరుసటిరోజునగానీ పిచికారి చేయాలి. విత్తిన 25, 30రోజులపుడు గొర్రు లేదా గుంటుకతో అంతర కృషి చేయాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదెలు సరిచేయాలి. పంట పూత దశలో లీటరు నీటికి 10గ్రా. యూరియా కలిపి పిచికారి చేయడం ద్వారా 20-25శాతం నత్రజని ఆదాతో పాటు అదిక దిగుబడి పొందవచ్చు.

    నీటి యాజమాన్యం
    వర్షాకాలంలో సక్రమంగా వర్షాలు రాకపోతే 7-8 రోజులకోసారి నీరు పెట్టాలి. వేసవి పంటకు ప్రతి 4-5 రోజులకొకసారి నీరు పెట్టాలి.

    సమగ్ర సస్యరక్షణ
    ఒక ఎకరాకు 100కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వాడాలి. కాయ తొలుచు పురుగుల ఉనికిని గమనించేందుకు లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున అమర్చాలి. అంతే కాకుండా ఎకరానికి 4చొప్పున పసుపురంగు పూసిన రేకులకు ఆముదం, గ్రీసు పూసిపెట్టి తెల్లదోమను ఆకర్షింపజేయాలి. ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోగ్రామ బదనికలను పూత దశలో వారానికి ఒకసారి చొప్పున 4సార్లు విడుదల చేయాలి.

    విడుదల సమయంలో పురుగు మందులు వాడొద్దు. రసం పీల్చే పురుగుల నివారణకు ఫాసలోన్, ఫిఫ్రోనిల్, డైమీతోయెట్‌ మందుల్లో ఏదేని ఒకదానిని లీటరు నీటికి 2మి.లీ.చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా.ల ఎసిఫెట్‌ను ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. కాయతొలుచు పురుగుల నివారణకు కార్బరిల్‌ 3 గ్రా. లేదా ఫ్రొఫెనోఫాస్‌ 2మి.లీ ఒకలీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement