ఎస్సీ కులాలకు భూమి కొనుగోలు పథకం
ఎస్సీ కులాలకు భూమి కొనుగోలు పథకం
Published Wed, Oct 19 2016 10:51 PM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM
ఎస్సీ కార్పొరేషన్ ఎండీ విజయకుమార్
కాకినాడ రూరల్ షెడ్యూల్డ్ కులాల వారికి ఆస్తులు సమకూర్చడం ద్వారా ఆర్థిక పురోగతిని అందించే ఉద్దేశంతో భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ తెలిపారు. బుధవారం స్థానిక తూరంగి భాస్కర గార్డెన్‌లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్సీ మహిళలతో స్త్రీ శక్తి సమ్మేళనం జరిగింది. ముఖ్యఅతిథి విజయకుమార్ మాట్లాడుతూ ఇందుకోసం జిల్లాలో ఎకరం రూ.16 లక్షల వరకు భూమి కొనుగోలు చేస్తామని చెప్పారు. భూమి లేని వ్యవసాయ మహిలా కూలీలకే భూములను ఇస్తారని వివరించారు. భూముల్లో బోర్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గాల వారికి వ్యాపారం, పరిశ్రమల ఏర్పాటుకు ఒక కోటి రూపాయల వరకు సబ్సిడీ, రుణం కలిపి ఇచ్చే ప్రతిపాదన ఉందని తెలిపారు. మహిళలు అక్షరాస్యత సాధించాలని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
గ్రూపుల ద్వారానే అమలు
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే సహకారాన్ని మహిళా స్వయం శక్తి గ్రూపుల ద్వారానే అమలు చేస్తారని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ఎస్సీ కులాల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రతి సంఘం తీసుకున్న రుణాన్ని నిర్ణీత కాలంలో చెల్లిస్తే, బ్యాంకుల నుంచి తిరిగి రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో రుణాలు అందించడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయని వివరించారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఆస్పత్రుల్లో ప్రసవాలు వంటి వాటిపై సంఘాలు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, విజయనగరం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వి.రాజా, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డేవిడ్‌రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement