కబ్జా స్థలంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం | land grabbing by tdp leaders in guntur for state Office | Sakshi
Sakshi News home page

కబ్జా స్థలంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం

Published Fri, Apr 29 2016 9:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

కబ్జా స్థలంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం - Sakshi

కబ్జా స్థలంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం

లీజు వెయ్యి గజాలు.. ఆక్రమణ 1,637 గజాలు
► 17 ఏళ్లుగా టీడీపీ ఆక్రమణలోనే ప్రభుత్వ స్థలం
► 1999 నుంచి ఆ స్థలానికి పైసా కూడా చెల్లించని వైనం
► ‘సాక్షి’ కథనంతో హడావుడిగా కదిలిన లీజు ఫైల్
► పెండింగ్‌లో ఉండగానే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
► కబ్జా స్థలాన్ని క్రమబద్ధీకరించాలంటూ ఒత్తిళ్లు


సాక్షి, గుంటూరు: అక్రమాన్ని సక్రమం చేయడంలో అధికార టీడీపీ నేతలు ఆరితేరారు. అనుమతుల్లేని కట్టడమైన ముఖ్యమంత్రి రెస్ట్‌హౌస్‌పై ఇప్పటికే సక్రమ ముద్ర వేసిన సంగతి తెలిసిందే. కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మార్చి దాన్ని సక్రమం చేసే పనిలో పడ్డారు. టీడీపీ కార్యాల యం కోసం గుంటూరు నగర పాలక సంస్థకు చెందిన 1,667 గజాల స్థలా న్ని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించారు.

దీనిపై సాక్షి ‘అధికార పార్టీ కార్యాలయానికి అక్రమ పునాది’ శీర్షికన గతేడాది ఆగస్టులో కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆక్రమణ స్థలాన్ని తమకు లీజుకివ్వాలంటూ టీడీపీ నాయకులు హడావుడిగా నగర పాలక సంస్థకు దరఖాస్తు చేశారు. అధికారులు ఆ ఫైల్‌ను జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేకు పంపగా ఆయన దాన్ని ఆమోదించి నిర్ణయం కోసం రాష్ట్ర పురపాలక శాఖకు పంపారు. దీనిపై పురపాలక శాఖ అధికారులు ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు.  అయినా టీడీపీ పెద్దలు మాత్రం ఆక్రమిత స్థలంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకొనేందుకు పార్టీ పెద్దలు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
 

కార్పొరేషన్ ఆదాయానికి గండి
టీడీపీ అధికారంలో ఉండగా 1999లో గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం నగరంలో ఖరీదైన ప్రాంతమైన అరండల్‌పేట పిచుకలగుంటను ఎంపిక చేశారు. టీఎస్ నంబర్ 826లో వెయ్యి చదరపు గజాల(20 సెంట్ల) స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ స్థలాన్ని 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం 1999 జూలై 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి కేవలం రూ.25 వేల చొప్పున నగర పాలక సంస్థకు అద్దె చెల్లించాలని, ప్రతి మూడేళ్లకోసారి లీజును రెన్యూవల్ చేస్తూ 33 శాతం అద్దె పెంచాలని పేర్కొంది. ఇక్కడివరకు సవ్యంగానే కనిపిస్తున్నప్పటికీ టీడీపీ నేతలు లీజుకు తీసుకున్న స్థలం పక్కనే ఉన్న మరో 1,637 చదరపు గజాల(34 సెంట్లు) స్థలాన్ని సైతం ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మిం చారు. అప్పట్లో ఈ విషయాన్ని నగర పాలక సంస్థ అధికారులు గుర్తించినప్పటికీ అధికార పార్టీకి చెందిన కార్యాలయం కావడంతో దాని జోలికి వెళ్లలేదు. 2008లో దీనిపై ఫిర్యాదులు రావడంతో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు కదిలారు.

భూ ఆక్రమణ జరిగినట్లు తేలడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తమ కార్యాలయం పక్కన గుంతలుగా ఉన్న స్థలాన్ని చదును చేసి పార్కింగ్ కోసం ఆక్రమించామని ఒప్పుకుంటూ అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చారు. ఆక్రమించిన స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నగర పాలక సంస్థకు లేఖ రాశారు. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపలేదు. అయినా ఆ స్థలం టీడీపీ కార్యాలయం ఆక్రమణలోనే ఉండిపోయింది. లీజుకు తీసుకున్న స్థలానికి ప్రస్తుతం ఏడాదికి రూ.89,881 చొప్పున చెల్లిస్తున్నారు. కానీ 17 ఏళ్లుగా టీడీపీ కబ్జాలో ఉన్న ఈ  స్థలానికి సంబంధించి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. లీజుకు అనుమతి లేకపోవడంతో డబ్బు చెల్లించలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండిపడింది.
 
నేడు టీడీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

 టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్ ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement