ప్రత్యేక హోదా కోసం న్యాయవాదుల నిరసన
విజయవాడ లీగల్ : ప్రత్యేక హోదా కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. సివిల్ కోర్టుల ప్రాంగణంలో బీబీఏ హాలు ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షుడు చోడిశెట్టి మన్మథరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇవ్వ కుండా కేంద్ర పభుత్వం దోబూచులాడుతుందన్నారు. హోదా ప్రకటించకపోతే యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని, రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత న్యాయవాదులు విధులకు గైర్హాజరై, కోర్టుల ప్రాంగణం చుట్టూ తిరిగి నినాదాలు చేశారు. బీబీఏ ప్రతినిధులు డి.ఆంజనేయప్రసాద్, కె.చంద్రమౌళి, పి.శ్రీనివాసరావు, పి.కిరణ్,కె.వర ప్రసాదరావు, ఎన్.ప్రసాదరావు,సీనియర్ న్యాయవాదులు వి.గురునాథం, వెన్నా.రమేష్ చంద్రబాబు, గోగువెట్టి వెంకటేశ్వరరావు, ఎ.వి.రమణ, మద్ది జ్ఙానాంబ,కోట జయరాజ్, రాజకుమారి, కె.వి.రంగారావు పాల్గొన్నారు.