ఐక్యంగా మద్యాన్ని తరిమికొడదాం.. | laxmanreddy fires on wine | Sakshi
Sakshi News home page

ఐక్యంగా మద్యాన్ని తరిమికొడదాం..

Published Sat, Jul 22 2017 9:49 PM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM

ఐక్యంగా మద్యాన్ని తరిమికొడదాం.. - Sakshi

ఐక్యంగా మద్యాన్ని తరిమికొడదాం..

అనంతపురం రూరల్‌: సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం పక్కనపెట్టి రాష్ట్రాన్ని ప్రభుత్వం మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్యం వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు లక్ష్మణ్‌రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించి మద్యం మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మద్యానికి వ్యతిరేకంగా శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ భాగం మద్యానికి బానిసైనవారు పేద, మధ్య తరగతి కుటుంబాలే వారి సంపాదనలో 80శాతం మేర మద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పేదల్ని పీల్చిపిప్పి చేస్తూ ప్రతి ఏటా రూ.85వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకుంటోందన్నారు. గుజరాజ్, బీహార్‌ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించి అభివృద్ధివైపు పయనిస్తున్నాయన్నారు.

ఫలితంగా ఆ రాష్ట్రాల్లో నేరాలు, రోడ్డు ప్రమాదాల ముందుతో పోలిస్తే గణనీయంగా తగ్గాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులే ప్రకటనలిచ్చారని గుర్తు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని మద్యాన్ని నిషేధించడంతో పాటు ప్రతి మండల కేంద్రంలో డీ అడిక‌్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మద్యానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మానవహక్కుల వేదిక నాయకులు బాషా, చంద్రశేఖర్, మహిళా సంఘాల సభ్యులు వరలక్ష్మి, సుభాషిణితో పాటు పలువురు పాల్గొన్నారు.

బీరును హెల్త్‌ డ్రింక్‌ అనడం సిగ్గు చేటు : మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌
బీరు హెల్త్‌ డ్రింక్‌ అంటూ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌ ప్రకటించడం  వెనుక ప్రభుత్వ ఉద్ధేశం బయట పడింది. ఇలాంటి ప్రకటనలు చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తోంది. మద్యం అమ్మకాలను ప్రభుత్వమే పోత్సహిస్తోందనడానికి మంత్రి ప్రకటనే నిదర్శనం. మద్యం నియంత్రణకు చేపట్టే ప్రతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

ప్రభుత్వం హైటెక్‌ మద్యం విక్రయాలు చేస్తోంది : నదీమ్, వైఎస్సార్‌ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  
ప్రభుత్వం హైటెక్‌ పద్దతుల్లో మద్యం విక్రయాలను కొనసాగిస్తోంది. జాతీయ రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కి హైటెక్‌ పద్ధతుల్లో జాతీయ రహదారులను జిల్లా రహదారులుగా మార్చి, జీఓలను సైతం విడుదల చేసి జాతీయ రహదారుల వెంట దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సిగ్గు చేటు.

మళ్లీ మోసపూరిత ప్రకటన : గోవిందరాజులు, విశ్రాంత జాయింట్‌ కలెక్టర్‌
బెల్టు తీయాలంటూ ముఖ్యమంత్రి మళ్లీ మోసపూరిత ప్రకటన చేశాడు. మూడేళ్ల క్రితం బెల్టుషాపుల తొలగింపు ఫైల్‌పై చేసిన సంతకం ఏమైందో.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బెల్టు షాపులు ఎత్తివేశారో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలి.

కుటుంబాలు రోడ్డున పడుతున్నాయ్‌ : సావిత్రమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి
ప్రభుత్వ నూతన మద్యం పాలసీతో పేద, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం తప్పు. వెంటనే మద్యాన్ని నిషేధించాలి.

నేరాల సంఖ్య పెరుగుతోంది: భానుజా, రెడ్స్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి
మద్యం సేవించి యువత పెడదారిన పడుతోంది. మద్యం మత్తులో విచక్షణకోల్పోయి నేరాలు చేసే స్థాయికి ఎదిగిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి.

మద్యానికి బానిసై హత్యలు చేస్తున్నారు : పద్మావతి, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి
మద్యం మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. హత్యలు, అత్యాచారాలు చేయడానికి ఒడిగడుతున్నారు. మద్యానికి డబ్బివ్వనందుకు కళ్యాణదుర్గం మండలంలో తల్లినే హత్య చేసిన ఘటనే ఇందుకు నిదర్శనం. బెల్టుషాపుల రద్దుకు ప్రత్యక్ష ఉద్యమం చేపట్టాలి.

చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయాలి : కేవీ రమణ, కాంగ్రెస్‌ నాయకులు
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే బెల్టుషాపులు రద్దు చేస్తున్నట్లు సంతకం చేశాడు. మరి ఇప్పుడు మళ్లీ బెల్టుషాపుల్ని ఎత్తివేయాలని ఉత్తర్వులు జారీ చేయడం ఏంటి? గడిచిన మూడేళ్లపాటు చంద్రబాబే దగ్గరుండి బెల్టుషాపు నడిపించాడు. అతడిపై ముందుగా కేసు నమోదు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement