శ్రీమఠానికి వాస్తు దోషమా!
► ప్రాకారం పశ్చిమ భాగంలో
► దారి మూసివేత పీఠాధిపతి గది ఆగ్నేయ
► ద్వారానికి తాళాలు
మంత్రాలయం: ప్రముఖ పుణ్యక్షేత్రం రాఘవేంద్రస్వామి శ్రీమఠంలో వాస్తు మార్పిళ్లకు మఠం అధికారులు తెరతీశారు. ఇటీవల శ్రీమఠంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడంతో వాస్తు దోషాలు సరిచేయడం మొదలెట్టారు. గతనెల మఠం దివాన్ బండాచార్‌పై సంస్కృత పాఠశాల పండితుడు చెయ్యి చేసుకున్నారు. స్వామిజీపై 10 రోజుల క్రితం కర్ణాటకలోని ఓ చానెల్‌లో ఇద్దరు వ్యక్తులు ఆరోపణలు చేయడం దుమారం రేగింది. అనుకోకుండా పీఠాధిపతులు ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్ రాజీనామా, ఉపసంహరణ చోటు చేసుకుంది. శుక్రవారం శిలామండపం నిర్మాణం పనుల్లో భాస్కర్ అనే వ్యక్తిపై బండరాయి పడింది.
వంట సరుకులు అనసరంగా స్టాక్ చేయడంతో కాలం చెల్లడం బయటకు పొక్కింది. ఇలా ఒకదాని తర్వాత ఒక సమస్య తలెత్తుండటంతో వాస్తు దోషాలే కారణమని భావిస్తున్నారు. దోషాల నుంచి గట్టెక్కేందుకు చర్యలు చేపట్టారు. మఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు భవనం ఆనుకుని పశ్చిమ దిశ ప్రాకారం ద్వారాన్ని మూసేసి గోడ కట్టించారు. స్వామిజీ గది ఆగ్నేయ భాగంలోని తలుపులకు సైతం తాళాలు వేయించారు. ప్రస్తుతం గది ఈశాన్య భాగంలోని తలుపును మాత్రమే ప్రవేశానికి తెరిచి ఉంచారు. అదే గదిలోనే స్వామిజీ సేవా భక్తులకు ఆశీర్వాదాలు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఒకే తలుపు తెరవడంతో కాస్త ఇబ్బందికరంగా మారింది. అంతకు ముందు మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి గర్భాలయంలోనూ హోమాలు సైతం చేయించారు. ఏది ఏమైనా వాస్తు దోషాల సరిచేసుకోవడంతోనైనా సమస్యలు సమసి పోతాయో వేచిచూద్దాం.
రీమఠం శిలా మండప నిర్మాణంలో అపశ్రుతి - రాతిబండ పడి కూలీకి గాయాలు
రాఘవేంద్రస్వామి మఠం గర్భాలయ శిలామండప నిర్మాణంలో అపశ్రుతి చోటుచేసుకుంది. తమిళనాడులోని పుదుకోట జిల్లాకు చెందిన భాస్కర్ 10 రోజుల క్రితం శిలా మండప నిర్మాణ పనులకు ఇక్కడకు వచ్చారు. శుక్రవారం ఉదయం రాతిబండలు పేరుస్తుండగా ఒకటి ప్రమాదవశాత్తు అతడి కాలిపై పడింది. దీంతో కుడికాలు తొడ భాగంలో బలమైన గాయమైంది. అక్కడున్న భక్తులు వెంటనే కాలిపై పడిన రాతిబండను తొలగించారు. స్థానిక శ్రీమఠం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స తర్వాత ఆదోని ఆస్పత్రికి తరలించారు.