వారణాసి : ఈ తరం పిల్లలు ధోతులు కట్టుకోమంటే.. ధోతులా.. మేమా? అంటూ జారుకుంటారు. జీన్స్, టీషర్ట్స్‌కు ఇచ్చే ప్రాధాన్యతను మన ఆచారాలు, సంప్రదాయా దుస్తులకు ఏ మాత్రం ఇవ్వరు. కానీ మన ఆచారాలను, సంప్రదాయాలను పాటించే పాఠశాలు, పిల్లలు మన దేశంలో ఇంకా ఉన్నారు. వారు ధోతులు, కుర్తాలు ధరించడమే కాదు.. క్రికెట్‌ను కూడా వాటితోనే ఆడుతున్నారు. పైగా ఏలాంటి ఇబ్బంది లేకుండా మైదానంలో ఇరగదీస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ మ్యాచ్‌లకు సంస్కృతంలోనే కామెంట్రీ చెప్పడం. ప్రస్తుతం ఈ క్రికెట్ టోర్నీ.. ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. క్రికెట్ అంటే పడి చచ్చే మనదేశంలో ధోతులతో క్రికెట్.. సంస్కృతం కామెంట్రీ అనగానే జనాలు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. అయ్యో.. ఎక్కడా ఈ టోర్నీ అంటూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ టోర్నీ ‘సంస్కృతం క్రికెట్ లీగ్’గా ప్రాచూర్యం పొందింది.
ఇంతకీ ఈ టోర్నీ సంగతేంటంటే..
వారణాసీలోని సంపూర్ణానంద సంస్కృత విద్యాలయాల 75వ వ్యవస్థాపక దినోత్వవం సందర్భంగా క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో వారణాసీ వ్యాప్తంగా ఉన్న సంస్కృత పాఠశాలలు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ఆయా పాఠశాల విద్యార్థులు ధోతి, కుర్తాతో పాటు మూడు నామాలు పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్నారు. అంపైర్లు కూడా కుర్తా, ధోతిలోనే ఆడిస్తున్నారు. ఈ టోర్నీకి సంస్కృతంలో కామెంట్రీ కూడా చెబుతున్నారు. ఈ ధోతి క్రికెట్‌ను చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు ఎగబడుతున్నారు.
విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు పాఠశాల టీచర్ గణేశ్ దత్ శాస్త్రి మీడియాకు తెలిపారు. ‘ఈ టోర్నీ 10 ఓవర్ల ఫార్మాట్. వారణాసిలో అన్నీ సంస్కృత పాఠశాలలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మొత్తం 5 జట్లు పోటీ పడుతున్నాయి. విద్యార్థులందరూ.. ధోతి,కుర్తాలను ధరిస్తారు. ఈ టోర్నీ మరో ప్రత్యేకత ఏంటంటే.. నారాయణ మిశ్రా, వికాస్ దీక్షిత్ అనే ఇద్దరు టీచర్లు సంస్కృతం కామెంట్రీ చెప్తారు. సంస్కృతం క్రికెట్ లీగ్‌గా ఈ టోర్నీ ప్రాచుర్యం పొందడం చాలా గర్వంగా ఉంది’ అని గణేశ్ దత్ సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment