నేతల్లో కదలిక
- ‘కారు..చిచ్చు’ కథనంతో
- అంతరంగం బట్టబయలు
- నర్సాపూర్ విభజనపై స్పష్టమైన అభిప్రాయాలు
సాక్షి, సంగారెడ్డి: ‘కారు.. చిచ్చు’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నర్సాపూర్ నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా రాజకీయవర్గాలు, ప్రజల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు నర్సాపూర్ విభజనపై నిన్నటి వరకు మనసులో మాట బయటపెట్టని నేతలు ‘సాక్షి’ కథనంతో తమ అంతరంగాన్ని బయపెట్టారు. ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలన్నారు.
జిల్లా పునర్విభజనలో నర్సాపూర్ మండలాన్ని మొదట సంగారెడ్డి జిల్లాలో కలపాలని ఆపై మనసు మార్చుకున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆదివారం కౌడిపల్లిలో మరోసారి తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలోని ఆరు మండలాలను మెదక్ జిల్లాలో కలపాలని, నర్సాపూర్‌ను డివిజన్ కేంద్రం చేయాలని స్పష్టం చేశారు.
మరోవైపు నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని పట్టుదలగా ఉన్న టీఆర్‌ఎస్ జిల్లా సారథి మురళీయాదవ్ సైతం తన మనోభావాలను వెల్లడించారు. నర్సాపూర్ విభజనకు సంబంధించి సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు శిరోధార్యమని సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి సైతం నర్సాపూర్ విభజనపై ఆదివారం హత్నూరలో మాట్లాడారు. నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలని, నర్సాపూర్, హత్నూర, శివ్వంపేట, గుమ్మడిదల, జిన్నారంను కలిపి నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు.
నర్సాపూర్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలు నియోజకవర్గ విభజనపై స్పష్టమైన వైఖరిని వెలిబుచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ ప్రారంభమైంది.
అధికార పార్టీ నేతలది చెరోదారి
నర్సాపూర్ నియోజకవర్గం విభజన ముసాయిదా వెలువడినప్పటి నుంచి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ మధ్య విభేదాలు రేకెత్తాయి. నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలని మురళీయాదవ్ మొదటి నుంచి పట్టుదలగా ఉన్నారు.
ఆ మేరకు నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డిలో కలిపేందుకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ఒప్పించి.. అధిష్టానానికి లేఖ సైతం ఇప్పించారు. నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డిలో కలుపుతున్నట్లు ముసాయిదా వెలువడటం, తన సొంత మండలమైన కౌడిపల్లిని తూప్రాన్ డివిజన్‌లో కలపడం ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి రుచించ లేదు. దీంతో యూటర్న్ తీసుకుని నర్సాపూర్ నియోజకవర్గాన్ని తథాతథంగా కొనసాగిస్తూ మెదక్‌లో కలపాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.
మరోవైపు మురళీయాదవ్ నర్సాపూర్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని పట్టుదలగా ఉన్నారు. ఆ మేరకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, విభజనకు సంబంధించి సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. నర్సాపూర్‌కు చెందిన ఇద్దరు టీఆర్‌ఎస్ నేతలు చెరో వైఖరితో ఉన్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ టీఆర్‌ఎస్ పార్టీ నేతల్లో మొదలైంది.
అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్ చేయటం మురళీయాదవ్ వర్గానికి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నర్సాపూర్ నియోజకవర్గ పరిణామాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం.
నర్సాపూర్ విభజనపై ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ వైఖరి, స్థానికుల అభిప్రాయాలు, అభ్యంతరాలు, ఆందోళనలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
యథాతధంగా ఉంచాలి
నియోజకవర్గంలోని ఆరు మండలాలను యథాతధంగా ఉంచుతూ కొత్తగా ఏర్పాటు చేసే మెదక్ జిల్లాలో కలిపి, నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలి. ఒకే నియోజకవర్గంలో ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్ ఉన్నారని నియోజకవర్గం విడదీయవద్దు. - సి.మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే.
సీఎం నిర్ణయం శిరోధార్యం
మెదక్ జిల్లా విభజన విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. నర్సాపూర్‌కు సంబంధించి సీఎం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీలోని నేతలు కట్టుబడి ఉండాలి. - మురళీయాదవ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
రెవెన్యూ డివిజన్ చేయాలి
నర్సాపూర్‌తో పాటు హత్నూర, శివ్వంపేట మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలి. అలాగే జిన్నారం, గుమ్మడిదల మండలాలను కలిపి నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి. - సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు