బాబోయ్.. లీడింగ్ చానల్
బాబోయ్.. లీడింగ్ చానల్
Published Sun, Jul 31 2016 7:16 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
విజయవాడ వైపు పూర్తిగా కాంక్రీట్‌తో నిర్మాణం
సీతానగరంలో ఇసుక బస్తాలతో మమ..
జారిపడితే అంతే సంగతులు!
సీతానగరం (తాడేపల్లి రూరల్) : సీతానగరం పుష్కర ఘాట్లపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోంది. రాజధాని ప్రాంతమైన సీతానగరం పుష్కరఘాట్ల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పనుల్లో బెజవాడకు, తాడేపల్లికి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.
అక్కడ అలా..
కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీళ్లు వస్తాయా? లేదా? అనే అనుమానంతో విజయవాడ పుష్కర ఘాట్లలో ప్రకాశం బ్యారేజీ నుంచి రెండున్నర కిలోమీటర్ల మేర రూ.5 కోట్లతో లీడింగ్ చానల్ ఏర్పాటుచేశారు. ఈ చానల్ అడుగు భాగం కాంక్రీట్ ఫ్లాట్‌ఫాం నిర్మించి, ఘాట్ల నుంచి లీడింగ్ చానల్ వరకూ మరో ప్లాట్‌ఫాం ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి స్నానాలు ఆచరించేందుకు, కాలువలోకి దిగేందుకు ప్రత్యేక మెట్లు సిద్ధం చేశారు. కృష్ణానది వైపు ఇసుక బస్తాలు ఏర్పాటుచేసి కట్టలు నిర్మించారు.
ఇక్కడ ఇలా..
సీతానగరంలో.. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఘాట్ల వద్ద ఏర్పాటుచేసే లీడింగ్ చానల్ పరిస్థితి దారుణంగా మారింది. ఘాట్లలో విధులు నిర్వహించే ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేసి పంపినప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం భక్తులు పుణ్యస్నానం చేసేందుకు గానూ ఘాట్ల వద్దకు నీరు ఎలా తెప్పిస్తారని అధికారులను ప్రశ్నించారు. విజయవాడలో మాదిరిగానే లీడింగ్ చానల్ ఏర్పాటుచేయాలని సూచించారు. అయినా ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. దీంతో స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్ సిబ్బంది కాంట్రాక్టర్‌కు నచ్చజెప్పి లీడింగ్ చానల్ ఏర్పాటు చేయనున్నారు.
ఇసుక బస్తాలతో చానల్..!
సీతానగరంలోని లీడింగ్ చానల్‌ను పూర్తిగా ఇసుక బస్తాలతో నిర్మిస్తున్నారు. పుష్కర ఘాట్లకు, కృష్ణానదిలో ఉన్న నీటి మట్టానికి 14 అడుగుల వ్యత్యాసం ఉండడంతో.. ఆంజనేయస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న ఘాట్ వద్ద చానల్ కలుపుతూ కాంక్రీట్‌తో పది అడుగుల తొట్టి ఏర్పాటుచేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి అర కిలోమీటరు పొడవున పైపులైను వేసి, లీడింగ్ చానల్‌లోకి నీరు పంపనున్నారు. రైల్వే బ్రిడ్జి దాటిన తరువాత 8 అడుగుల ఎత్తులో మరో తొట్టి ఏర్పాటుచేసి దానిపై నుంచి నీరు బయటకు వెళ్లేలా ప్లాన్ చేశారు.
Advertisement