అల్పాహారం వడ్డిస్తున్న పోలీసులు (ఫైల్)
‘దొంగల’నగరం పేరు మార్చేశారు..!
Published Wed, Aug 24 2016 7:56 PM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
* ఒక్క చోరీ సంఘటన కూడా జరగకుండా చర్యలు
* ఫలించిన పోలీసు వ్యూహం
* గుంటూరు కృష్ణా జిల్లాలలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా సీతానరగం పేరు చెబితే పోలీసుల వెన్నులో వణుకుపుడుతుంది. అందుకు కారణం ఎక్కడ ఏ బహిరంగ సభ జరిగినా, ఉత్సవాలు, ఊరేగింపులూ జరిగినా అక్కడ జరిగే దొంగతనాలలో సీతానగరం వాసుల హస్తం ఉంటుందని నమ్మకం, అది నిజం కూడా.
* తమిళనాడు రాష్ట్రంలో ఐపీఎస్‌లు, ఐఎఎస్‌లు వ్యాయామం కోసం వెళ్ళే జిమ్ములో ఒకే సారి రూ.కోటి విలువ చేసే సెల్‌ఫోన్‌లు, బంగారపు వస్తువులు దొంగిలించింది కూడా సీతానగరం వాసులు కావడం విశేషం. మూడు నెలల అనంతరం ఎవరు దొంగిలించారో గుర్తించడం కూడా జరిగింది.
సీతానగరం(తాడేపల్లిరూరల్): అలాంటి సీతానగరంలో కృష్ణా పుష్కరాలు నిర్వహించాలని తెలియగానే మొదట పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, సీఐ హరికృష్ణ, ఎస్‌ఐ వినోద్‌కుమార్, ప్రతాప్‌కుమార్ గత పుష్కరాలలో జరిగిన అసాంఘిక కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని మూడు నెలల ముందు నుండే నిఘా పెంచారు. దానిలో భాగంగానే తాడేపల్లిలో పోలీసు విధులు నిర్వహించిన ఎస్‌ఐలను, ఐడీ పార్టీ సిబ్బంది సలహాలు సూచనలు తీసుకుని దాదాపు 150 మంది నేరగాళ్ళకు రౌడీషీటర్లకు విడతల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అంతటితో వదిలిపెట్టకుండా నేరచరిత్ర ఉన్న ప్రతి ఒక్కరి ఇంటిపైనా నిఘా ఏర్పాటు చేసి వారి ఇంటికి వచ్చిన నేరగాళ్ళను సైతం అదుపులోకి తీసుకుని పుష్కరాలు అయ్యేంత వరకూ ఈ ప్రాంతానికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ మర్యాద పూర్వకంగా హెచ్చరించి మరీ ఈ ప్రాంతం నుంచి పంపించారు.
సీసీ కెమెరాల నిఘా..
ఇదంతా ఒక ఎత్తుగడ అయితే తాడేపల్లి ముఖ్యకూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ పుటేజీలను పరిశీలిస్తూ ఎప్పటికప్పడు నిఘా పెంచారు. దీని ఫలితంగా పుష్కరాలలో ఒక్క చోరీ కూడా జరగలేదు. పుష్కరస్నానాలకు సీతానగరం ఘాట్‌కు వచ్చిన భక్తులు పోగొట్టుకున్న వస్తువులను పోలీసులు వెతికి బాధితులకు అందజేయడం విశేషం, ప్రశంసనీయం. దీంతో పాటు పుష్కర స్నానాలకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కొరకు పోలీసు వాహనాలలో పుష్కరఘాట్‌ల వరకూ తీసుకువచ్చి స్నానం ఆచరించేలా చూడటం, తిరిగి తీసుకెళ్ళడంతో భక్తుల నుంచి శభాష్ పోలీసు అనిపించుకున్నారు.
Advertisement
Advertisement