Seetha nagaram
-
పెళ్లి చేసుకుంటామన్న మైనర్లు..
సాక్షి, సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని జాలిమూడికి చెందిన ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకుంటామంటూ పెద్దలను ఎదిరించడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. జాలిమూడికి చెందిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని గురువారం రాత్రి పెద్దలకు చెప్పారు. 100 నంబర్‌కు కాల్ వెళ్లడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న అమ్మాయి, ఎదురింటిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి తల్లి విదేశాల్లో ఉండడంతో మేనమామ ఇంటి వద్ద ఉంటోంది. పెళ్లి విషయం వ్యతిరేకించిన మేనమామతో గొడవపడి ఎదురింటిలోని అబ్బాయి ఇంటికి వెళ్లింది. దీంతో గొడవ జరుగుతుందని భావించిన అబ్బాయి తరఫు వారు 100 నంబర్‌కు కాల్ చేయడంతో స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి, సర్టిఫికెట్లు పరిశీలించి నాలుగు నెలలో అబ్బాయికి, ఇరవై రోజుల్లో అమ్మాయికి మైనార్టీ తీరుతుందని చెప్పి, ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరు కుటుంబాలవారు వివాహం చేసేందుకు ఒప్పుకొన్నారు. చదవండి: స్ర్కీన్ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..! -
విజయకీలాద్రిపై ధ్వజస్తంభ ప్రతిష్ఠ
సీతానగరం (తాడేపల్లి రూరల్) : విజయకీలాద్రిపై త్రిదండి చినజీయర్ స్వామి నిర్మిస్తున్న 9 దేవాలయాల ప్రాంగణంలో ధ్వజ స్తంభ ప్రతిష్టను సోమవారం కనులపండువగా నిర్వహించారు. చినజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాలపై గోపురాలను ప్రతిష్టించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక హోమాలు చేశారు. వేదవిద్యార్థుల మంత్రోశ్చరణాల మధ్య ప్రత్యేక పూజలు, ధ్వజస్తంభం ప్రతిష్టించారు. కార్యక్రమంలో ఎంపీ గోకరాజు గంగరాజుతోపాటు క్రేన్ వక్కపొడి అధినేత లక్ష్మీకాంతారావు, లీలాచక్రధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టను తిలకించేందుకు వచ్చిన భక్తులను ఆశ్రమ నిర్వాహకులు వాహనాలలో కొండపైకి తరలించారు. భక్తులు నవధాన్యాలు చల్లి తమ భక్తిని చాటుకున్నారు. దేవతావిగ్రహాలను గుడిలో ప్రతిష్టించేందుకు ఆలయం చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యులు, రఘు తదితరులు పాల్గొన్నారు. చినజీయర్ స్వామి, దాతల ఆధ్వర్యంలో దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. -
ఇళ్లు నిర్మించారో.. కూల్చివేతే!
* సీతానగరంలో ప్రత్యేక బృందం సిద్ధం * మునిసిపల్ సిబ్బంది నిరంతర నిఘా సీతానగరం (తాడేపల్లి రూరల్): రాజధాని ప్రాంతమైన తాడేపల్లి మునిసిపాలిటిలో కొత్తగా ఎవరు ఇళ్లు నిర్మించినా దాన్ని కూల్చేందుకు మునిసిపల్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్ తదితర ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే మహానాడు, సుందరయ్య నగర్, సీతానగరం మీదుగా ప్రధాన రహదార్లు నిర్మించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకోసమే ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు నిలిపివేసింది. అనుమతులు లేకుండా ఎవరైనా చిన్న గుడిసె వేసినా కూల్చేసేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసింది. సెటిలర్స్‌కు కేటాయించి.. 1950 సంవత్సరానికి పూర్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడేవారి కోసం సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్ ప్రాంతంలో ఓ జైలు ఏర్పాటు చేసి, సుమారు 200 ఎకరాల చుట్టూ కంచె ఏర్పాటు చేసి వారిని తీసుకువచ్చి ఇక్కడి జైలులో ఉంచేవారు. అప్పట్లో వారందరినీ పోషించడం ప్రభుత్వానికి కష్టంగా మారడంతో దాదాపుగా 100 కుటుంబాలుగా ఏర్పాటు చేసి, వారికి(సెటిలర్స్) ఆ భూములను కేటాయించారు. ఇప్పటికీ ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న సెటిలర్స్ కుటుంబాలు చాలా ఉన్నాయి. దీంట్లో 173 ఎకరాలు కాలక్రమేణా పంట పొలాల నుంచి పాట్లుగా రూపొందాయి. ఈ ప్రాంతం విజయవాడ, గుంటూరు నగరాలకు దగ్గరగా ఉండడం, స్థలాల రేట్లు తక్కువగా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కొంచెమో గొప్పో డబ్బు కలిగిన వారు ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు ప్రభుత్వం సూపర్ టాక్స్ పేరుతో రెట్టింపు ఇంటి పన్నులు వసూలు చేసింది. దీన్ని కూడా రద్దు చేస్తూ తాజాగా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 2015 తరువాత ఎవరు ఇళ్లు నిర్మిచుకున్నా, దాన్ని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నెల్లూరులో ఎదురుదెబ్బ... మొదట ఈ ప్రాంతంలో ప్రారంభిస్తే ఎక్కడ వ్యతిరేక వస్తుందోనని మునిసిపల్ మంత్రి నారాయణ తన సొంత జిల్లా నెల్లూరు మునిసిపాలిటిలో ఈ ప్రక్రియ చేపట్టారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతోనే తాడేపల్లి మునిసిపాలిటిలో ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచనతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. బిల్డింగ్ ప్లాన్ కావాలంటే ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అలా అనుమతి కోసం వెళితే, తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 20 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభ్యం కావు. ఒకవేళ కాదు కూడదని ఎవరైనా చిన్న గుడిసె వేసినా, దాన్ని కూల్చేందుకు ప్రత్యేక అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీని నిమిత్తమే రెగ్యులేషన్ చేస్తామంటూ తాడేపల్లి మునిసిపాలిటిలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు. సుమారు 7 వేల మంది యజమానులు తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటూ దరఖాస్తు చేశారు. దీని ఆధారంగానే కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
‘దొంగల’నగరం పేరు మార్చేశారు..!
* ఒక్క చోరీ సంఘటన కూడా జరగకుండా చర్యలు * ఫలించిన పోలీసు వ్యూహం * గుంటూరు కృష్ణా జిల్లాలలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా సీతానరగం పేరు చెబితే పోలీసుల వెన్నులో వణుకుపుడుతుంది. అందుకు కారణం ఎక్కడ ఏ బహిరంగ సభ జరిగినా, ఉత్సవాలు, ఊరేగింపులూ జరిగినా అక్కడ జరిగే దొంగతనాలలో సీతానగరం వాసుల హస్తం ఉంటుందని నమ్మకం, అది నిజం కూడా. * తమిళనాడు రాష్ట్రంలో ఐపీఎస్‌లు, ఐఎఎస్‌లు వ్యాయామం కోసం వెళ్ళే జిమ్ములో ఒకే సారి రూ.కోటి విలువ చేసే సెల్ఫోన్లు, బంగారపు వస్తువులు దొంగిలించింది కూడా సీతానగరం వాసులు కావడం విశేషం. మూడు నెలల అనంతరం ఎవరు దొంగిలించారో గుర్తించడం కూడా జరిగింది. సీతానగరం(తాడేపల్లిరూరల్): అలాంటి సీతానగరంలో కృష్ణా పుష్కరాలు నిర్వహించాలని తెలియగానే మొదట పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, సీఐ హరికృష్ణ, ఎస్ఐ వినోద్‌కుమార్, ప్రతాప్‌కుమార్ గత పుష్కరాలలో జరిగిన అసాంఘిక కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని మూడు నెలల ముందు నుండే నిఘా పెంచారు. దానిలో భాగంగానే తాడేపల్లిలో పోలీసు విధులు నిర్వహించిన ఎస్ఐలను, ఐడీ పార్టీ సిబ్బంది సలహాలు సూచనలు తీసుకుని దాదాపు 150 మంది నేరగాళ్ళకు రౌడీషీటర్లకు విడతల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అంతటితో వదిలిపెట్టకుండా నేరచరిత్ర ఉన్న ప్రతి ఒక్కరి ఇంటిపైనా నిఘా ఏర్పాటు చేసి వారి ఇంటికి వచ్చిన నేరగాళ్ళను సైతం అదుపులోకి తీసుకుని పుష్కరాలు అయ్యేంత వరకూ ఈ ప్రాంతానికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ మర్యాద పూర్వకంగా హెచ్చరించి మరీ ఈ ప్రాంతం నుంచి పంపించారు. సీసీ కెమెరాల నిఘా.. ఇదంతా ఒక ఎత్తుగడ అయితే తాడేపల్లి ముఖ్యకూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ పుటేజీలను పరిశీలిస్తూ ఎప్పటికప్పడు నిఘా పెంచారు. దీని ఫలితంగా పుష్కరాలలో ఒక్క చోరీ కూడా జరగలేదు. పుష్కరస్నానాలకు సీతానగరం ఘాట్‌కు వచ్చిన భక్తులు పోగొట్టుకున్న వస్తువులను పోలీసులు వెతికి బాధితులకు అందజేయడం విశేషం, ప్రశంసనీయం. దీంతో పాటు పుష్కర స్నానాలకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కొరకు పోలీసు వాహనాలలో పుష్కరఘాట్ల వరకూ తీసుకువచ్చి స్నానం ఆచరించేలా చూడటం, తిరిగి తీసుకెళ్ళడంతో భక్తుల నుంచి శభాష్ పోలీసు అనిపించుకున్నారు. -
సీతానగరంలో పత్రిజీ పుష్కర స్నానం
సీతానగరం (తాడేపల్లి రూరల్): మహానాడు మానససరోవరం జ్ఞానమందిరం సభ్యులు బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో శనివారం సీతానగరం ఘాట్ వద్ద కష్ణానదిలో పుష్కరస్నానాలు చేశారు. ఈ సందర్భంగా మానస సరోవరం సభ్యులందరూ మహానాడు, సుందరయ్యనగర్, సీతానగరం తదితర ప్రాంతాలలో పుష్కరాలపై ప్రచారం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీతానగరం వద్ద ఘాట్‌లో పుష్కరస్నానాలు చేసి ధ్యానంలో పాల్గొన్నారు. పుష్కరస్నానాల ప్రాముఖ్యతను భక్తులకు బ్రహ్మర్షి పత్రీజీ వివరించారు. -
వాచ్టవర్ల ఏర్పాటు
సీతానగరం (తాడేపల్లిరూరల్): మండలంలోని సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో నిరంతర పర్యవేక్షణ కోసం మంగళవారం నిఘాకు టవర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ సీఐ హరికృష్ణ మాట్లాడుతూ సీతానగరంలో 450 మీటర్ల పొడవు ఉన్న పుష్కర ‡ఘాట్లను బైనాక్యులర్ ద్వారా పర్యవేక్షించేందుకు అయ్యప్పస్వామి దేవాలయంపై భాగంలో, గాంధీ బొమ్మ వెనుక ఉన్న భవనంపై, పాత రైల్వే బ్రిడ్జి టవర్‌పై ఏర్పాటు చేసినట్లు తెలిపారు.