ఇళ్లు నిర్మించారో.. కూల్చివేతే!
ఇళ్లు నిర్మించారో.. కూల్చివేతే!
Published Mon, Aug 29 2016 9:02 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
* సీతానగరంలో ప్రత్యేక బృందం సిద్ధం
* మునిసిపల్ సిబ్బంది నిరంతర నిఘా
సీతానగరం (తాడేపల్లి రూరల్): రాజధాని ప్రాంతమైన తాడేపల్లి మునిసిపాలిటిలో కొత్తగా ఎవరు ఇళ్లు నిర్మించినా దాన్ని కూల్చేందుకు మునిసిపల్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్ తదితర ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే మహానాడు, సుందరయ్య నగర్, సీతానగరం మీదుగా ప్రధాన రహదార్లు నిర్మించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకోసమే ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు నిలిపివేసింది. అనుమతులు లేకుండా ఎవరైనా చిన్న గుడిసె వేసినా కూల్చేసేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసింది.
సెటిలర్స్‌కు కేటాయించి..
1950 సంవత్సరానికి పూర్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడేవారి కోసం సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్ ప్రాంతంలో ఓ జైలు ఏర్పాటు చేసి, సుమారు 200 ఎకరాల చుట్టూ కంచె ఏర్పాటు చేసి వారిని తీసుకువచ్చి ఇక్కడి జైలులో ఉంచేవారు. అప్పట్లో వారందరినీ పోషించడం ప్రభుత్వానికి కష్టంగా మారడంతో దాదాపుగా 100 కుటుంబాలుగా ఏర్పాటు చేసి, వారికి(సెటిలర్స్) ఆ భూములను కేటాయించారు. ఇప్పటికీ ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న సెటిలర్స్ కుటుంబాలు చాలా ఉన్నాయి. దీంట్లో 173 ఎకరాలు కాలక్రమేణా పంట పొలాల నుంచి పాట్లుగా రూపొందాయి. ఈ ప్రాంతం విజయవాడ, గుంటూరు నగరాలకు దగ్గరగా ఉండడం, స్థలాల రేట్లు తక్కువగా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కొంచెమో గొప్పో డబ్బు కలిగిన వారు ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు ప్రభుత్వం సూపర్ టాక్స్ పేరుతో రెట్టింపు ఇంటి పన్నులు వసూలు చేసింది. దీన్ని కూడా రద్దు చేస్తూ తాజాగా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 2015 తరువాత ఎవరు ఇళ్లు నిర్మిచుకున్నా, దాన్ని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
నెల్లూరులో ఎదురుదెబ్బ...
మొదట ఈ ప్రాంతంలో ప్రారంభిస్తే ఎక్కడ వ్యతిరేక వస్తుందోనని మునిసిపల్ మంత్రి నారాయణ తన సొంత జిల్లా నెల్లూరు మునిసిపాలిటిలో ఈ ప్రక్రియ చేపట్టారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతోనే తాడేపల్లి మునిసిపాలిటిలో ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచనతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. బిల్డింగ్ ప్లాన్ కావాలంటే ఆన్‌లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అలా అనుమతి కోసం వెళితే, తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 20 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభ్యం కావు. ఒకవేళ కాదు కూడదని ఎవరైనా చిన్న గుడిసె వేసినా, దాన్ని కూల్చేందుకు ప్రత్యేక అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీని నిమిత్తమే రెగ్యులేషన్ చేస్తామంటూ తాడేపల్లి మునిసిపాలిటిలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు. సుమారు 7 వేల మంది యజమానులు తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటూ దరఖాస్తు చేశారు. దీని ఆధారంగానే కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Advertisement
Advertisement