అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
సుండుపల్లి:
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం అగ్రహారంలో శనివారం చోటుచేసుకుంది. రైతు రాజగోపాల్‌రెడ్డి (46) సొంతూరు రాయచోటి మండలం సుజ్జాల. సుండుపల్లి అగ్రహారానికి 15 ఏళ్ల క్రితం వచ్చాడు. అప్పటినుంచి యేటిగడ్డరాచపల్లి, నర్సరీ సమీపంలో ఉన్న 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, కూరగాయలు, వేరుశనగ పంటలను సాగుచేసేవాడు. అయితే పంటల్లో దిగుబడి సరిగా రాక చేసిన అప్పులు తీరకపోవడంతో శనివారం తెల్లవారుజామున గుళికలమందు తిని పొలంవద్ద పడిపోయాడు. సమీపంలోని రైతులు గమనించి బంధువులకు తెలియజేయడంతో వారంతా వచ్చిచూసేసరికి అప్పటికే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డికి ప్రైవేటుగా, బ్యాంకుల్లో కలిపి రూ.10లక్షల వరకు అప్పు ఉంది. కుమారుడు కె. రమేష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై మధుసూధన్‌రెడ్డి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు.