వనం వీడి.. జనంలోకి చిరుత!
♦ మెదక్ జిల్లా తుక్కాపూర్‌లో భయం..భయం
♦ ఏడున్నర గంటలపాటు బీభత్సం.. 9 మందిపై దాడి
♦ ఎట్టకేలకు వలకు చిక్కడంతో ఊపిరిపీల్చుకున్న జనం
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామాన్ని ఓ చిరుత పులి వణికించింది. దాదాపు ఏడున్నర గంటలపాటు బీభత్సం సృష్టిం చింది. తొమ్మిది మందిని గాయపరిచింది. ఫారెస్ట్, జూ అధికారులు వచ్చి ఎట్టకేలకు దాన్ని బంధించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉద యం గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. మంగళి బుజ్జమ్మపై మొదట దాడి చేసింది. బుజ్జమ్మ తన పిల్లలను బడికి పంపించి తిరిగి ఇంటికి వస్తుండగా.. దారిలో ఎదురుపడి ఆమెపై పంజా విసరడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు మంగళి శంకరయ్య, ఆయన కుమారులు మల్లేశం, యాదయ్యలు కర్రలు తీసుకుని చిరుతను అదిలించేందుకు వెళ్లారు. బుజ్జమ్మను వదిలి తండ్రీకొడుకులపై దాడికి దిగింది. ఈ దాడిలో ఈ ముగ్గురూ గాయపడ్డారు. అయినప్పటికీ వారు ఎదురుదాడికి దిగడంతో ఆయిలి పోచమ్మ ఇంట్లోకి దూరింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందులోనే గంటపాటు నక్కింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులంతా చిరుత నక్కిన ఇంటి పరిసరాలకు చేరుకున్నారు. జనం అరుపులకు బెదిరిన చిరుత ఇంట్లో నుంచి బయటకు వచ్చి జనంపై పడింది.
ఘటనా స్థలికి చేరుకున్న అధికారగణం...
మెదక్ ఆర్డీఓ నగేశ్, డీఎఫ్‌ఓ శివాని డోగ్రే, అటవీ, జూ, పోలీస్, అగ్నిమాపక శాఖలకు చెం దిన అధికారులు, సిబ్బందితో కలసి తుక్కాపూర్ చేరుకున్నారు. చిరుత ఉన్న పశువుల పాక ప్రాంతంలోని దారులను వలలతో మూసి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చిరుతను పశువుల పాక నుంచి కదిలించేందుకు బాణసంచా కాల్చారు. ఈ శబ్దాలకు బయటకు వచ్చినట్లే వచ్చి మళ్లీ పాకలోకి వెళ్లింది. ఇలా మూడోసారి బయటకు వచ్చి చివరకు అధికారులు ఏర్పాటు చేసిన వలకు చిక్కింది. హైదరాబాద్ జూపార్కు నుంచి వచ్చిన అధికారులు చిరుతపై తుపాకీతో మత్తు ఇంజక్షన్లతో దాడిచేయగా అది మత్తులోకి జారుకుంది. మధ్యాహ్నం చిరుతను హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించడం తో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స
చిరుత దాడిలో గాయపడిన వారందరినీ చికిత్స కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నలుగురిని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన సాయమ్మను తదుపరి చికిత్సల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచిం చారు. సాయమ్మ ఎడమ చెవిపైన దాదాపు ఎనిమిది అంగుళాల మేర చర్మం తెగిపోయి తీవ్రంగా గాయపడింది.
ఉరుకులు, పరుగులు..
ఒక్కసారిగా చిరుత రావడంతో జనమంతా బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతి లో పెట్టుకొని ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే చిరుత గ్రామానికి చెందిన ఆయిలు రాములుపై దాడి చేసింది. చిరుతను చూసేందుకు వచ్చిన రంగంపేట వాసి చాకలి పోచయ్యపై దాడి చేసి మెడ భాగంలో తీవ్రంగా గాయపరిచింది. ఆ తరువాత తుక్కాపూర్‌కు చెందిన దొడ్లె శ్రీశైలం, కొండ పాపయ్యలపై దాడి చేసింది. చివరకు ఆయిలి కేశయ్య పశువుల పాకలోకి దూరింది. అక్కడ కట్టేసి ఉంచిన ఓ పశువును గాయపరిచింది. 4 గంటలపాటు పశువుల పాకలోనే ఉండిపోయింది.