► కలెక్టరేట్‌లో ఇ–ఆఫీస్
సాక్షి,సిటీబ్యూరో: పేపరు లెస్ ఆఫీస్ లక్ష్యంగా హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఇ–ఆఫీస్ సాఫ్ట్‌వేర్ ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని తొమ్మిది విభాగాల ఫైళ్లకు సంబంధించిన పేజీలను స్కానింగ్ చేయటం ద్వారా ఆ ఫైళ్లలోని వివరాలన్నీ భద్రపర్చనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎన్‌ఐసీ యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా, ఢిల్లీ ఎన్‌ఐసీ మానిటరింగ్ చేస్తోంది. దీనికి సంబంధించి కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన 140 మంది ఉద్యోగులకు శిక్షణ కూడా ఇచ్చారు.
ఈ నెల 8 నుంచి ఇ–ఆఫీస్ ద్వారా ఫైళ్ల స్కానింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 2,149 ఫైళ్లకు సంబంధించి 1,95,794 పేజీలను స్కానింగ్ చేశారు. ప్రతి రోజూ 20 వేల పేజీల స్కానింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కలెక్టరేట్ తొమ్మిది విభాగాలకు సంబంధించి 13,278 ఫైళ్లు ఉండగా, 10,43,901 పేజీలు ఉన్నట్టు అధికారయంత్రాంగం అంచనా వేస్తోంది.
ఈ ఫైళ్లలో ఉద్యోగుల వివరాలు, జిల్లాకు చెందిన వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు, పకృతి వైఫరీత్యాలు, అగ్నిప్రమాదాలు, ఎక్స్‌గ్రేషియా వంటి వివరాలున్నాయి. అదేవిధంగా భూమి వివాదాలు, కోర్టు కేసులు, ఆక్రమణలు, పట్టాల పంపిణీ, భూముల క్రమబద్ధీకరణ, స్లమ్స్ వివరాలున్నాయి. హైదరాబాద్ జిల్లాకు చెందిన సమగ్ర సమాచారానికి సంబంధించిన పూర్వపరాలన్నీ ఈ ఫైళ్లలో ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.