
నీరు–చెట్టు.. పనులన్నీ తీసికట్టు
– హిందూపురం నియోజకవర్గంలో పనులన్నీ నాసిరకం
– పైపూతలతో సరిపెట్టి రూ.లక్షలు కాజేసిన కాంట్రాక్టర్లు
– అప్పుడే దెబ్బతిన్న కాలువలు, మరువలు
హిందూపురం నియోజకవర్గంలో చేపట్టిన నీరు–చెట్టు పనుల్లో నాణ్యత లోపించింది. పచ్చచొక్కాల నాయకులు కాంట్రాక్టర్ల అవతారమెత్తి లక్షలాది రూపాయలు కొల్లగొట్టారు. ఆయకట్టుదారుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఈ పనులను కమీషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీంతో వారు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. అధికారులు కళ్లు మూసుకుని బిల్లులు చేసేస్తున్నారు. నాణ్యమైన మట్టి వేసి చెరువు కట్టలు పటిష్టం చేయాల్సి ఉండగా.. ఎరువు చల్లినట్లుగా మట్టి పోస్తున్నారు. కాలువలు, మరువలు, తూముల పనులను కూడా పైపూతలతో సరిపెడుతున్నారు. పదికాలాల పాటు రైతులకు ఉపయోగపడాల్సిన ఈ పనులను నాసిరకంగా చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హిందూపురం అర్బన్ : హిందూపురం నియోజకవర్గానికి నీరు–చెట్టు పథకం కింద రూ.6.88 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిని మూడు మండలాల పరిధిలోని 92 చిన్న, పెద్ద చెరువులతో పాటు కుంటల పునరుద్ధరణ, సప్లయ్ చానళ్లు, మట్టికట్టల అభివద్ధికి కేటాయించారు. ఈ పనులను ఆయా ఆయకట్టుదారుల సంఘాల ఆధ్వర్యంలో చేయాల్సి ఉంది. అయితే.. స్థానికంగా టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి కమీషన్ల కోసం పనులను మండలాల వారీగా పంపకాలు చేయించారు. పనులు పొందిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యతకు పూర్తిగా తిలోదకాలిచ్చారు. చేసిన పదిరోజులకే సిమెంట్ నిర్మాణాలు నెర్రెలు చీలాయి.
– హిందూపురం మండలంలోని 34 చెరువులు, కాలువల అభివద్ధికి రూ.2.58 కోట్లు కేటాయించారు. మణేసముద్రం చెరువు వద్ద రూ.9.96 లక్షలతో పనులు చేశారు. పైపైన మట్టి తోలి వదిలేయడంతో చెరువుకట్టకు అప్పుడే పగుళ్లు ఏర్పడ్డాయి. మంచి వర్షం వస్తే కట్టపై చల్లిన మట్టి పూర్తిగా చెరువు కిందకు చేరిపోయే పరిస్థితి ఉంది. చెరువు మరువకు చేసిన సిమెంట్ పనులు కూడా నాసిరకంగా ఉన్నాయి. పెద్దగుడ్డంపల్లి వద్ద సప్లయ్ చానల్ ఉన్న కట్టడాన్ని తొలగించి కొత్తది కడుతున్నారు. ఈ పనుల్లో నాణ్యమైన కంకర, ఇసుక వాడటంలేదు. కాలువకు ఉన్న పాతరాళ్లను కాంట్రాక్టర్ తరలించుకుపోయినట్లు తెలిసింది. రూ.7.65 లక్షలతో చేపట్టిన కొట్నూరు చెరువు అభివద్ధి పనుల్లోనూ నాణ్యత డొల్లేనని తేలుతోంది. ఈ చెరువు కట్టపై వనమ్మ ఆలయం ఉంది. ఆలయం వెనుక విస్తరణ కోసం నిర్వాహకులు వేసిన మట్టిని కూడా చెరువు పనులకు వాడినట్లు ఆరోపణలున్నాయి.
– లేపాక్షి మండలానికి రూ.2.25 కోట్లు కేటాయించారు. కల్లూరు చెరువు నుంచి సప్లయ్ చానళ్ల పనులన్నీ పూర్తి నాసిరకంగా తయారయ్యాయి. కాంక్రీట్ ఊడిపోయి రాళ్లు, మట్టి బయటకు తేలిపోయాయి. లేపాక్షి చిన్నచెరువుకు అనుబంధంగా నిర్మించిన సప్లయ్ చానల్ పనులు నెర్రెలు చీలాయి. నీరు ప్రవహిస్తే పగుళ్లనుంచి లీకయ్యే అవకాశముంది.
– చిలమత్తూరు మండలానికి రూ.2.04 కోట్లు కేటాయించారు. కోడూరు చెరువుకట్ట పనిని యంత్రాలతో కాంట్రాక్టర్ పూర్తిచేశారు. చిలమత్తూరు చెరువు నుంచి ఉన్న సప్లయ్ చానల్‌తోపాటు కట్టకాలువ పనులను జేసీబీతో తూతూ మంత్రంగా చేపట్టారు. దీనికితోడు చెరువులో మట్టి పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి.
పనులు పరిశీలిస్తున్నాం – శైలేంద్ర, డీఈ, ఇరిగేషన్
పనులను పరిశీలిస్తున్నాం. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా తనిఖీ చేస్తున్నారు. ఆయకట్టుదారుల సంఘాల సభ్యులు కొందరు కొత్తవారు కావడంతో వారి బంధువుల సహకారం తీసుకుని పనులు చేసి ఉంటారు. నాణ్యత లేకపోతే బిల్లులో రికవరీ చేస్తాం.