పనుల్ని పరుగెత్తించండి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :
పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ, సేద్యపు నీటి పనుల ప్రగతిని పరిశీలించేందుకు వచ్చే వారం నుంచి తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. ఎక్కడైనా పనులు నత్తనడకన సాగుతుంటే సహించేది లేదని హెచ్చరించారు. సేద్యపు నీటి పథకాల తీరు, జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ, జల రవాణా ప్రాజెక్టు పనుల తీరుపై అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. డెల్టా ఆధునికీకరణకు సంబంధించి 10 ప్యాకేజీల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. యనమదుర్రు డ్రెయిన్ పరిధిలో 39 వేల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు వారం రోజుల్లో పూర్తి కావాలన్నారు.
జనవరి 5 నాటికి నాట్లు నాట్లు పూర్తవ్వాలి
జిల్లాలో రైతులకు మూడో పంట వేసుకోవడానికి అనుమతించిన దృష్ట్యా రబీ పంట ముందుగానే పూర్తి చేయాలని, జనవరి 5 నాటికి రైతులంతా నాట్లు పూర్తి చేసేలా చూడాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరిని ఆదేశించారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, డీఆర్‌వో కట్టా హైమావతి, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్ , ఆర్ అండ్ బీ ఎస్‌ఈ నిర్మల పాల్గొన్నారు.