ఐదుగురికి జీవిత ఖైదు
ఐదుగురికి జీవిత ఖైదు
Published Sat, Jul 1 2017 12:16 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
- హత్యకేసులో ముద్దాయిలుగా తేల్చిన కోర్టు
- వెలుగోడు వాసులకు శిక్ష విధిస్తూ ఆదేశం
కర్నూలు (లీగల్) : వెలుగోడు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఐదుగురు ముద్దాయిలుగా తేలడంతో జీవితఖైదు, రూ. 3వేల ప్రకారం జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు తీర్పు చెప్పింది. వెలుగోడులో 2007 జనవరి 3వ తేదీన చిన్న జమ్మన్నపై గొడ్డళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని క్షత్రగాత్రుడి భార్య తెలుగు మద్దమ్మ వెలుగోడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త చిన్న జమ్మన్న ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తెలుగు రామాంజినేయులుకు మద్దతు ఇవ్వలేదని కక్షగట్టి దాడి చేశారని ఫిర్యాదు చేసింది.
దీంతో తెలుగు రామాంజనేయులు (అప్పటి వెలుగోడు సర్పంచ్), అతని సోదరుడు జంబులయ్య, బంధువులు హరిప్రసాద్, మల్లయ్య, రామకృష్ణ, వెంకట్రాముడిపై పోలీసులు హత్యాయత్నం చేసు నమోదు చేశారు. గాయపడిన చిన్న జమ్మన్న చికిత్స పొందుతూ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో జనవరి 8వ తేదీన మృతిచెందడంతో హత్య కేసుగా మార్పు చేశారు. కేసు విచారణలో ఉండగానే రెండో నిందితుడు హరిప్రసాద్ మృతిచెందాడు. నేరం రుజువు కావడంతో మిగతా ఐదుగురికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వీవీ శేషుబాబు తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరుపున పీపీ రాజేంద్రప్రసాద్ వాదించారు.
Advertisement
Advertisement