విడుదల లేనట్టే!
క్షమాభిక్ష కోసం జీవిత ఖైదీల ఎదురుచూపు
పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న వారు 42 మంది
జీఓ విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
క్షణికావేశంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఎంతో మంది ఖైదీలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులకు, భార్యా, బిడ్డలకు దూరమై మానసిక క్షోభకు గురయ్యారు. ఇటువంటి వారంతా క్షమాభిక్ష కింద తమను స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల చేస్తారేమో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల క్షమాభిక్ష జీఓ విడుదలలో నిర్లక్ష్యం చేస్తోంది.
బుక్కరాయసముద్రం: రెడ్డిపల్లి వద్ద గల ఆరుబయలు కారాగారం (ఓపెన్ ఎయిర్ జైలు)లో వంద మంది ఖైదీలు ఉన్నారు. ఏడు సంవత్సరాల శిక్ష, మూడేళ్ల రెమ్యునేషన్ కలిసి మొత్తం పదేళ్ల శిక్ష అనుభవించిన వారు 42మంది వరకు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష జీఓ విడుదల చేస్తే స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని వీరంతా ఎదురు చూస్తున్నారు.
ఆశ అడియాసేనా..?
పదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న జీవిత ఖైదీలను ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) రోజున ప్రభుత్వం ‘క్షమాభిక్ష’ ద్వారా విడుదల చేస్తుంది. అయితే ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి.
భార్యా బిడ్డలకు దూరమయ్యా
అనుకోకుండా జరిగిన తప్పిదాలకు పదేళ్లుగా భార్యా బిడ్డలకు దూరమైపోయాను. మానసికంగా ఎంతో బాధ పడుతున్నాను. కుటుంబ సభ్యులతో కలసి జీవించాలని ఉంది. క్షమాభిక్ష జీఓ కోసం రాత్రిం పగళ్లు ఎదురు చూస్తున్నాను.
- గంగన్న, జీవిత ఖైదీ, పామిడి
ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి
జీవిత ఖైదీల క్షమాభిక్ష జీఓ విడుదల కోసం ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలి. కుటుంబాలకు దూరమై ఎంతో బాధ పడుతున్నాము. మమ్మల్ని కూడా స్వేచ్ఛా ప్రపంచంలో కలిసుండేలా కృషి చేయాలి.
- శివశంకర్‌రెడ్డి, జీవిత ఖైదీ, ప్రకాశం జిల్లా
అర్హుల జాబితా రెడీ
ఓపెన్ ఎయిర్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించి ‘క్షమాభిక్ష’కు అర్హులైన వారి జాబితా సిద్ధం చేశాం. జీఓ విడుదల ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు క్షమాభిక్ష జీఓ విడుదలకు సంబంధించిన జీఓ కాపీలు నాకు రావడం లేదు. ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లయితే నెల రోజుల ముందు ఓపన్ ఎయిర్ జైలుకు సమాచారం వస్తుంది.
- గోవిందరాజులు, సూపరింటెండెంట్, ఓపెన్ ఎయిర్ జైలు, రెడ్డిపల్లి.