waiting for release
-
కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!
చెన్నై, సాక్షి: జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల సొంత వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీనికితోడు దశాబ్ద కాలపు కనిష్టాలకు వడ్డీ రేట్లు చేరడం వాహన కొనుగోలుదారులకు ప్రోత్సాహాన్నిస్తోంది. అయితే ఇదే సమయంలో ఆటో రంగ కంపెనీలు నిర్వహణను మెరుగుపరిచేందుకు తాత్కాలికంగా ప్లాంట్లను నిలిపివేయడం, మరికొన్ని కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు వాహన సరఫరాలకు అంతరాయాలను కల్పిస్తున్నట్లు ఆటో రంగ నిపుణులు వివరించారు. దీంతో ప్రధానంగా కొన్ని కార్ల కంపెనీలు డిమాండుకు తగిన సరఫరాలు చేయలేకపోతున్నట్లు తెలియజేశారు. వెరసి అధిక డిమాండ్ కలిగిన మోడళ్లలో కొత్త కారును కొనుగోలు చేయాలంటే వినియోగదారులు కనీసం 30 రోజుల నుంచి 10 నెలల వరకూ వేచిచూడవలసిన పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) చిన్న కార్లు, ఎస్‌యూవీలు సైతం కొంతకాలంగా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనా(ఎస్యూవీ)లకే కాకుండా చిన్న కార్లకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. దీంతో ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలతోపాటు.. ఆటో దిగ్గజం మారుతీ తయారీ చిన్న కార్లకు సైతం వెయిటింగ్ పిరియడ్ నడుస్తున్నట్లు చెప్పారు. ఉదాహరణగా మారుతీ తయారీ ఆల్టో, వేగన్-ఆర్, స్విఫ్ట్‌తోపాటు.. హ్యుండాయ్ తయారీ ఐ20, వెర్నా తదితర కార్ల కొనుగోలు కోసం 1-10 నెలల సమయం వేచిచూడవలసి వస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి సామర్థ్యంతో నిజానికి గత అక్టోబర్ నుంచీ మారుతీ సుజుకీ ప్లాంట్లు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఆటో నిపుణులు తెలియజేశారు. అయినప్పటికీ స్విఫ్ట్, ఆల్టో, వేగన్-ఆర్ మోడళ్ల కార్లను సొంతం చేసుకునేందుకు కనీసం 3-4 వారాలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇక ఎర్టిగా మోడల్ డెలివరీకి 6-8 వారాలు వేచిచూడవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల మారుతీ నిర్వహణాసంబంధ కార్యక్రమాల కోసం ప్లాంట్లను వారం రోజులపాటు మూసివేసింది. ఇక హ్యూండాయ్ క్రెటా తదితర ప్రధాన మోడళ్ల తయారీని పెంచే సన్నాహాల్లో ఉంది. క్రెటా రోజువారీ తయారీ సామర్థ్యాన్ని గత ఆరు నెలల్లో 340 యూనిట్ల నుంచి 640 యూనిట్లకు పెంచినట్లు హ్యుండాయ్ తెలియజేసింది. ఈ బాటలో వెన్యూ, వెర్నా తయారీని పెంచుతున్నట్లు పేర్కొంది. ఇక 2-3 నెలల వెయిటింగ్ ఉంటున్న ఐ20 మోడల్ కార్ల తయారీని ఇటీవల నెలకు 9,000 నుంచి 12,000 యూనిట్లకు పెంచినట్లు వెల్లడించింది. వెర్నా మోడల్ కార్లను 40 శాతం వరకూ ఎగుమతి చేస్తున్నట్లు తెలియజేసింది. ఎంఅండ్ఎం సైతం ఇటీవల భారీగా పెరిగిన డిమాండుకు అనుగుణంగా నాసిక్‌లో వాహన ఉత్సాదక సామర్థ్యాన్ని పెంచినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలియజేసింది. దీంతో నెలకు 2,000 యూనిట్ల తయారీ నుంచి ప్రస్తుతం 3,500 యూనిట్లవరకూ పెరిగినట్లు వెల్లడించింది. ఎంఅండ్ఎం ఇటీవలే విడుదల చేసిన థార్ మోడల్ వాహన డెలివరీకి 20-40 వారాలు పడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఇదేవిధంగా నిస్సాన్ మ్యాగ్నైట్ మోడల్ తయారీని 2700 యూనిట్ల నుంచి నెలకు 4,000 వాహనాలకు పెంచినట్లు పేర్కొంది. కాగా.. మరోపక్క కియా మోటార్స్ ఇంజిన్లు, బంపర్ల సరఫరా సమస్యల కారణంగా సెల్టోస్, సోనెట్ మోడళ్ల డెలివరీకి 2-3 నెలల కాలం పడుతున్నట్లు ఆటో నిపుణులు తెలియజేశారు. కాగా.. డిసెంబర్లో గత దశాబ్ద కాలంలోలేని విధంగా ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 2,76,500 యూనిట్లకు చేరాయి. వార్షిక ప్రాతిపదికన 18 శాతం జంప్‌చేసినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
విడుదల లేనట్టే!
క్షమాభిక్ష కోసం జీవిత ఖైదీల ఎదురుచూపు పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న వారు 42 మంది జీఓ విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం క్షణికావేశంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఎంతో మంది ఖైదీలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులకు, భార్యా, బిడ్డలకు దూరమై మానసిక క్షోభకు గురయ్యారు. ఇటువంటి వారంతా క్షమాభిక్ష కింద తమను స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల చేస్తారేమో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల క్షమాభిక్ష జీఓ విడుదలలో నిర్లక్ష్యం చేస్తోంది. బుక్కరాయసముద్రం: రెడ్డిపల్లి వద్ద గల ఆరుబయలు కారాగారం (ఓపెన్ ఎయిర్ జైలు)లో వంద మంది ఖైదీలు ఉన్నారు. ఏడు సంవత్సరాల శిక్ష, మూడేళ్ల రెమ్యునేషన్ కలిసి మొత్తం పదేళ్ల శిక్ష అనుభవించిన వారు 42మంది వరకు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష జీఓ విడుదల చేస్తే స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని వీరంతా ఎదురు చూస్తున్నారు. ఆశ అడియాసేనా..? పదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న జీవిత ఖైదీలను ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) రోజున ప్రభుత్వం ‘క్షమాభిక్ష’ ద్వారా విడుదల చేస్తుంది. అయితే ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. భార్యా బిడ్డలకు దూరమయ్యా అనుకోకుండా జరిగిన తప్పిదాలకు పదేళ్లుగా భార్యా బిడ్డలకు దూరమైపోయాను. మానసికంగా ఎంతో బాధ పడుతున్నాను. కుటుంబ సభ్యులతో కలసి జీవించాలని ఉంది. క్షమాభిక్ష జీఓ కోసం రాత్రిం పగళ్లు ఎదురు చూస్తున్నాను. - గంగన్న, జీవిత ఖైదీ, పామిడి ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి జీవిత ఖైదీల క్షమాభిక్ష జీఓ విడుదల కోసం ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలి. కుటుంబాలకు దూరమై ఎంతో బాధ పడుతున్నాము. మమ్మల్ని కూడా స్వేచ్ఛా ప్రపంచంలో కలిసుండేలా కృషి చేయాలి. - శివశంకర్‌రెడ్డి, జీవిత ఖైదీ, ప్రకాశం జిల్లా అర్హుల జాబితా రెడీ ఓపెన్ ఎయిర్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించి ‘క్షమాభిక్ష’కు అర్హులైన వారి జాబితా సిద్ధం చేశాం. జీఓ విడుదల ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు క్షమాభిక్ష జీఓ విడుదలకు సంబంధించిన జీఓ కాపీలు నాకు రావడం లేదు. ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లయితే నెల రోజుల ముందు ఓపన్ ఎయిర్ జైలుకు సమాచారం వస్తుంది. - గోవిందరాజులు, సూపరింటెండెంట్, ఓపెన్ ఎయిర్ జైలు, రెడ్డిపల్లి. -
నిర్దోషికి శిక్ష పడొద్దంటే.. ఇదా పరిస్థితి
'వంద మంది దోషులు తప్పించుకన్నా ఫర్వాలేదుగానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు' అన్నది మన భారత న్యాయవ్యవస్థ మౌలికసూత్రం. వివిధ కేసుల్లో అరెస్టై ఎలాంటి శిక్షలు పడకుండా ఏళ్లపాటు జైళ్లలో మగ్గుతున్న పారుల విషయంలో ఈ సూత్రానికి ఎలాంటి భాష్యం చెప్పాలి? రుడాలి షా అనే యువకుడు ఓ కేసులో 1953లో అరెస్టయ్యారు. 1968లోనే న్యాయస్థానం ఆయనపై కేసును కొట్టివేసింది. అయినా.. ఆయన 1983 వరకు, అంటే 30 ఏళ్ల పాటు బిహార్‌లోని ముజఫర్‌పూర్ జైల్లో ఉన్నారు. బోకా ఠాకూర్ అనే యువకుడు తన 16వ ఏట ఓ కేసులో అరెస్టయ్యాడు. ఎలాంటి నేరం చేయకుండానే బీహార్‌లోని మధుబని జైల్లో 36 ఏళ్లపాటు జైల్లో ఉన్నారు. ఎలాంటి నేరం చేయకుండానే వీరిద్దరు జైలు శిక్ష అనుభవించారు. మరి ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని చెబుతున్న మన న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం ఏమైంది? ఇలాంటి వారు ఇద్దరే కాదు. అండర్ ట్రయల్స్‌గా జైల్లో మగ్గుతున్న 2,82,879 (2014 లెక్కల ప్రకారం) మంది పౌరుల్లో ఎన్ని వేల మంది నిర్దోషులు ఉన్నారో! వారిలో ఆరు నెలల నుంచి ఏడాదికి పైగా జైల్లో మగ్గుతున్నవారు 1,22,056 మందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కలు తెలియజేస్తున్నాయి. రెండున్నర లక్షల మందికి పైగా అండర్ ట్రయల్స్ ఉన్నారంటే అది కరేబియన్ దేశమైన బార్బడోస్ జనాభాకు సమానం. వీరిలో ఏడాదికి పైగా జైల్లో ఉంటున్న వారి సంఖ్య 25 శాతం ఉందంటే ఆశ్చర్యం వేస్తోంది. మొత్తం జైల్లో ఉంటున్న నేరస్థుల్లో 65 శాతం మంది కేసు విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలే. వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైల్లో ఉంటున్న వాళ్లు కాగా, ప్రతి పదిమందిలో ఇద్దరు ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైల్లో ఉంటున్నారు. రెండు కారణాల వల్ల వీరు అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారు. న్యాయసహాయం స్వీకరించే స్థోమత లేకపోవడం ఒకటి కాగా, న్యాయం కోసం లాయర్లను సంప్రదించే అవకాశాన్ని జైలు అధికారులు కల్పించక పోవడం మరో కారణం. వారు జైల్లో ఉండడం వల్ల వారిలో ఎక్కువమంది కుటుంబ సంబంధాలు కోల్పోవడమే కాకుండా చేస్తున్న ఉద్యోగాలను కూడా కోల్పోతున్నారు. ఫలితంగా మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల్లో ఎక్కువ మంది కశ్మీరు రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. కశ్మీర్లో 54 శాతం, గోవాలో 50 శాతం, గుజరాత్లో 42 శాతం, ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 40 శాతం మంది ఉన్నారు. ఈ దుస్థితి తన దృష్టికి రావడంతో సుప్రీం కోర్టు 1980లో రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం అండర్ ట్రయల్స్‌కు వేగంగా సముచిత న్యాయాన్ని అందించాల్సి ఉందని తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రభువులు ఎలా అర్థం చేసుకున్నారో, జైలు అధికారులకు ఈ తీర్పు గురించి కబురైనా ఉందో, లేదో తెలియదుగానీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పరిస్థితిని చక్కదిద్దాలనే సదుద్దేశంతో 2005లో అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం భారతీయ శిక్షాస్మృతిలోని 436ఏ సెక్షన్లో సవరణ తీసుకొచ్చింది. ఓ కేసు కింద విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ ఆ కేసు కింద తనకు పడే శిక్షలో సగభాగాన్ని జైల్లోనే గడిపితే, ఎలాంటి పూచీకత్తులు లేకుండా, కేవలం వ్యక్తిగత బాండుతోనే విడుదల చేయాలన్నది ఆ సెక్షన్లో తెచ్చిన మార్పు. ఈ సవరణ కూడా అండర్ ట్రయల్స్ విషయంలో పెద్దగా మార్పును తీసుకురాలేదు. సుప్రీంకోర్టు 2013లో తాను ఇచ్చిన తీర్పునకు కొనసాగింపుగా 2014లో మరో తీర్పును వెలువరించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 436ఏ సెక్షన్‌ను స్ఫూర్తిగా తీసుకొని సగం శిక్షను పూర్తిచేసుకున్న వారిని ఎలాంటి బాండులు లేకుండా బెయిల్‌పై విడుదల చేయాలని, అప్పటికే పూర్తి శిక్షను అనుభవించిన వారిని కూడా బేషరతుగా విడుదల చేయాలని తీర్పు చెప్పింది. దీనికి జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా జడ్జీ, జిల్లా ఎస్పీలతో కలిపి ఓ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలంటూ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఏడు వేల మంది అండర్ ట్రయల్స్ విడుదలయ్యారు. మొత్తం అండర్ ట్రయల్స్‌లో విడుదలైన వారు రెండు శాతం కూడా లేరంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.