Life Prisoners
-
జీవిత ఖైదీల విడుదలపై పలు సందేహాలు లేవనెత్తిన హైకోర్టు
సాక్షి, అమరావతి: జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారంపై హైకోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఆ ఖైదీలకు శిక్ష పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధానాన్ని అయితే అమలు చేస్తుం దో, అదే విధానం వారి విడుదల విషయంలోనూ అనుసరించాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో దోషులకు శిక్ష పడే సమయానికి ఉన్న విధానం, వారి విడుదల సమయంలో ఉన్న విధానం వేర్వేరుగా ఉన్న నేపథ్యంలో వారి విడుదలను హైకోర్టు ప్రశ్నించింది. దోషులకు 2006లో శిక్షపడినందున అప్పటి విధానం, ఈ శిక్షను ఖరారు చేస్తూ 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చే సమయానికి ఉన్న విధానం, ఇటీవల వారిని విడుదల చేసినందున ప్రస్తుత విధానం, ఇలా ఆ విధానాలన్నింటినీ తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ విధాన నిర్ణయాల సహేతుకతను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఖైదీలను విడుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉందని, అయితే జీవితఖైదు పడిన ఖైదీలు 14 ఏళ్ల శిక్ష అనుభవిస్తేనే వారిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో దోషులను విడుదల చేయాలంటూ గవర్నర్‌ను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్లో ఏ కారణాలు పేర్కొంది.. ఏ కారణాలతో గవర్నర్ వారి విడుదలకు ఆదేశాలిచ్చారో తెలుసుకోవాల్సిన అవసరం తమకుందని హైకోర్టు తెలిపింది. ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయాలని అటు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని, ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. తన భర్త పార్థమరెడ్డి హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 8 మంది నేరస్తులను ్ఠవిడుదల చేయడాన్ని సవాలు చేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మెట్టు గ్రామానికి చెందిన ముడి నవనీతమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
జీవిత ఖైదీల విడుదల అధికారం గవర్నర్‌కుంది
సాక్షి, అమరావతి: రాజ్యాంగం ప్రకారం జీవిత ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని ప్రభుత్వ న్యాయవాది (హోం) వేలూరి మహేశ్వరరెడ్డి వివరించారు. గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తున్నప్పుడు జీవిత ఖైదు పడ్డ వ్యక్తి 14 ఏళ్లు శిక్ష అనుభవించి తీరాలన్న నిబంధనను పాటించాల్సిన అవసరం లేదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా చెప్పిందన్నారు. సత్ప్రవర్తనతో పాటు విడుదలకు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు కలిగి ఉన్న ఖైదీలను మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇదే రీతిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 175 మందిని విడుదల చేశామని చెప్పారు. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు ఉద్దేశించిన విధాన నిర్ణయాన్ని, 14 ఏళ్ల శిక్ష పూర్తి కాక ముందే 8 మంది ఖైదీల విడుదలకు సంబంధించి గవర్నర్ ముందుంచిన ఫైల్‌ను కోర్టు ముందుంచామని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఖైదీల విడుదలలో ప్రభుత్వానికి అధికారం లేదనడంలేదని, అయితే జీవితఖైదు పడ్డ వారి విడుదల విషయంలో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలున్నాయా? ప్రభుత్వం అనుకుంటే జీవిత ఖైదు పడ్డ ఆరు నెలల్లోనే విడుదల చేయవచ్చా వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.తన భర్త పార్థమరెడ్డి హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 8 మందిని శిక్షాకాలం పూర్తి కాక ముందే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మెట్టు గ్రామానికి చెందిన ముడి నవనీతమ్మ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మంగళవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. జీవిత ఖైదు పడ్డ ఖైదీ 14 సంవత్సరాల జైలు జీవితాన్ని అనుభవిస్తేనే క్షమాభిక్షకు అర్హుడని తెలిపారు. ప్రస్తుత కేసులో విడుదలైన వారు క్షమాభిక్షకు అర్హులు కాదన్నారు. -
సిటీ‘లైఫ్’.. ఇస్మార్ట్ ప్రూఫ్
సాక్షి, హైదరాబాద్: ఇస్మార్ట్ ప్రూఫ్‌లు.. నేరస్థులను ఇట్టే పట్టిస్తున్నాయి. మూడోకన్ను పడిందంటే మూడినట్టే. నేరాల ప్రివెన్షన్, డిటెక్షన్, కన్వెక్షన్‌లో సీసీ కెమెరాలతోపాటు ట్యాబ్స్, ల్యాప్టాప్స్, యాప్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసుశాఖకు మౌలిక వసతులతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం సమకూర్చింది. సాంకేతిక సహాయంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోని సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగింది. ఫలితంగా వీటిల్లో శిక్షలు, ముఖ్యంగా జీవితఖైదు శిక్షలు పెరిగాయి. జీవితఖైదు పడుతున్న కేసుల్లో హత్య, పోక్సోయాక్ట్, మహిళలపై నేరాలతోపాటు ఇతరాలు ఉంటున్నాయి. జీవితఖైదు శిక్షలు ఈ ఏడాది జనవరి–ఆగస్టు మధ్య రాష్ట్రవ్యాప్తంగా పడిన జీవితఖైదుల్లో 35.8 శాతం ఈ మూడు కమిషనరేట్ల కేసులకు సంబంధించిన తీర్పులే. దీన్ని గుర్తించిన డీజీపీ కార్యాలయం ఇటీవల ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రంలోని 21 యూనిట్లలో 67 మందికి జీవిత ఖైదుపడగా వారిలో హైదరాబాద్ పరిధిలో 10, సైబరాబాద్, రాచకొండల్లో ఏడుగురు చొప్పున ఉన్నారు. క్లూస్ టీమ్స్.. నేరం జరిగినప్పుడు ఘటనాస్థలాల నుంచి వీటిని ఎంత వేగంగా, పక్కాగా సేకరించ గలిగితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకప్పుడు మూడు కమిషనరేట్లలో కలిపి కేవలం మూడే క్లూస్‌టీమ్స్ ఉండేవి. ఫలితంగా వారిపై పనిభారంతో పాటు క్రైమ్ సీన్స్‌కు చేరుకోవడంలో కాలయాపన జరిగేది. జాప్యాన్ని నివారించడానికి పోలీసు శాఖ డివిజినల్ క్లూస్‌టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. జియో ట్యాగింగ్ ప్రతి పోలీసు అధికారి రోజువారీ నిర్వర్తిస్తున్న విధులను తెలుసుకోవడం కోసం ప్రత్యేక ఆన్లైన్ నివేదికలను పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకుంటున్నారు. నేరగాళ్ల నివాసాలు, ఆవాసాలను సాంకేతికంగా గుర్తించడానికి సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్ చేయడంతోపాటు ఈ–లీవ్ విధానం అమలు వంటివి ప్రతిస్థాయి అధికారి, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయి. సీసీ కెమెరాలు.. నేరాలను నిరోధించడం, కేసుల్ని కొలిక్కి తేవడం, దోషులను నిర్ధారించడం వంటి అంశాల్లో సీసీ కెమెరాలు బాగా ఉపకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్యవర్గాల సహాయంతో కమ్యూనిటీ సీసీ కెమెరాలు, ‘నేను సైతం’ప్రాజెక్టు కింద సాధారణ ప్రజలతో సీసీటీవీలను ఏర్పాటు చేయించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాల సంఖ్య 3 లక్షలకు పైనే. రికార్డు అయిన ఫీడ్‌ను శాస్త్రీయంగా ఎలా సేకరించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. ఐఎస్ఎస్.. శిక్షల శాతం పెరగడంలో ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ (ఐఎస్ఎస్) పాత్ర ఎనలేనిది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కేంద్రంగా రెండేళ్లుగా పనిచేస్తున్న ఈ విభాగం దర్యాప్తు అధికారులకు ఆద్యంతం సహకరిస్తోంది. -
ఖైదీల్లో చిగురించిన ఆశలు
ఆరిలోవ(విశాఖ తూర్పు): అర్థరాత్రి క్షమాభిక్ష గంట మోగింది. ఖైదీల్లో ఆశలు చిగురింపజేసింది. ఎన్నో ఏళ్లుగా నాలుగు గోడల నడుమ మగ్గుతున్న ఖైదీలు కొందరు బయటపడే మార్గం సుగమమైంది. దీంతో వారిలో ఆనందం వెల్లువిరుస్తోంది. కారాగారాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను క్షమాభిక్షపై విడదుల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో మంగళవారం తీసుకొంది. అందులో భాగంగా అదేరోజు రాత్రి జీవో నంబరు 8ని విడుదల చేసింది. దీనిలో ఉన్న నిబంధనల ప్రకారం జైళ్లలో క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను సిద్ధంచేసి జైల్ అధికారులు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. 14 మంది అర్హులతో జాబితా జీవో నంబరు 8లోని నిబంధనల ప్రకారం విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలలో అర్హుల జాబితాను అధికారులు బుధవారం సిద్ధం చేశారు. ప్రభుత్వం విడదుల చేసిన జోవో ప్రకారం ఈ నెల 26 నాటికి అర్హులైన సత్ప్రవర్తన కలిగిన 14 మంది జాబితా సిద్ధం చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. వీరిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు ఎక్కువమందికాగా అనంతపురం, కర్నూలుకు చెందిన ఇద్దరు ఖైదీలున్నట్లు చెప్పారు. వారిలో విశాఖకు చెందిన ఓ మహిళ విడుదలకు అర్హులైనట్లు వివరించారు. ఈ జాబితా ఇక్కడ రెండుసార్లు స్క్రీనింగ్ జరుగుతుందన్నారు. అనంతరం డీఐజీ కార్యాలయానికి పంపిస్తామని, అక్కడ స్క్రీనింగ్ జరిగిన అనంతరం జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు పంపిస్తారన్నారు. వారు మరో రెండుసార్లు ఈ జాబితాను స్క్రీనింగ్ చేసిన అనంతరం అర్హులను ప్రకటిస్తారని తెలిపారు. అంతవరకు ఈ జాబితా గోప్యంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ఖైదీలు ఉగాదికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ జాబితాను ఫిబ్రవరి 2న జైళ్లశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఇవీ నిబంధనలు ♦ పురుషులు రిమాండ్‌తో పాటు ఏడేళ్లు వాస్తవ జైలు శిక్ష, మరో మూడేళ్లు రెమిషన్ పీరియడ్‌తో కలసి 10 సంవత్సరాలు శిక్ష అనుభవించి ఉండాలి. ♦ మహిళలు రిమాండ్‌తో పాటు ఐదేళ్లు శిక్ష అనుభవించి రెండేళ్లపాటు రెమిషన్ పీరియడ్‌తో కలిసి మొత్తం ఏడేళ్లు శిక్ష అనుభవించి ఉండాలి. ♦ 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వెసులుబాటు ఉంది. వారిలో పురుషులకు, మహిళలకు ఒకే విధంగా ఐదేళ్లు శిక్ష, మరో రెండేళ్లు రెమిషన్‌తో కలిపి ఏడేళ్లు శిక్ష అనుభవించి ఉండాలి. ♦ గంజాయి అక్రమ రవాణా కేసుల్లో శిక్ష పడినవారు అనర్హులు. (పదేళ్ల తర్వాత వీరు విడుదలవుతారు.) ♦ ఐపీసీ 379 నుంచి 402 సెక్షన్లపై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, కింది కోర్టులో శిక్షపడి పై కోర్టుకు వెళ్లడం ద్వారా శిక్ష తగ్గిన వారు, ఉరి శిక్ష పడి రాష్ట్రపతిచే శిక్ష మార్చబడినవారు అనర్హులు. రెండేళ్ల తర్వాత మళ్లీ రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్నుడు క్షమాభిక్ష జీవో విడుదలైంది. 2015 మార్చి 15న క్షమాభిక్ష జీవో విడుదలైంది. దీని ప్రకారం 2016 జూన్‌లో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 41 మంది జీవిత ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి కాలుపెట్టారు. 2013 డిసెంబరు 21న క్షమాభిక్షపై ఇక్కడి నుంచి 37 మంది ఖైదీలను విడుదల చేశారు. వారిలో ఇద్దరు మహిళా ఖైదీలున్నారు. దీంతోపాటు 2009 జనవరి 26న 25 మంది ఖైదీలు విడుదలయ్యారు. రెమిషన్ అంటే... సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలకు కొన్ని రోజులు శిక్ష పొందినట్లు కలుస్తాయి. ఇలాంటి ఖైదీలకు నెలకు 5 రోజులు చొప్పున కలుస్తాయి(ఏడాదిలో 60 రోజులు). దీంతోపాటు జైలు ఉన్నతాధికారి దృష్టిలో ఉత్తముడుగా గుర్తింపు పొందిన ఖైదీలకు ఏడాదిలో 30 రోజులు కలుపుతారు. ఇవి కాకుండా రాష్ట్ర జైళ్లశాఖ ఉన్నతాధికారులు సైతం ఏడాదిలో 30 రోజులు కలుపుతారు. ఇలా పొందిన రోజులనే రెమిషన్ పీరియడ్‌గా లెక్కిస్తారు. ఈ కాలాన్ని ఖైదీ శిక్ష అనుభవించిన కాలానికి జతచేస్తారు. ఇలా రెమిషన్ పీరియడ్ పురుషులకు మూడేళ్లు, మహిళలకు రెండేళ్లు ఉంటే క్షమాభిక్షకు ఉపయోగపడుతుంది. -
ఈసారీ మౌనమే
క్షణికావేశంలో నేరం చేసి.. కఠినకారాగార శిక్ష అనుభవిస్తూ కుటుంబ సభ్యులకు దూరమైన వారు క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం మాత్రం మొగ్గు చూపడం లేదు. గణతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయాల్సిన జీవిత ఖైదీల విషయంలో ఇప్పటి వరకూ జీఓ ఊసే లేదు. దీంతో జీవిత ఖైదీలకు ఈసారి కూడా నిరాశే ఎదురవుతోంది. అనంతపురం, బుక్కరాయసముద్రం: జిల్లాలోని రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (ఆరుబయలు కారాగారం)లో మొత్తం 62 మంది ఖైదీలున్నారు. వీరిలో ఏడు సంవత్సరాల శిక్షతో పాటు మూడు సంవత్సరాలు రెమ్యూనేషన్ కలిపి మొత్తం 10 సంవత్సరాలు శిక్ష అనుభవించిన వారు 40 మంది వరకు ఉన్నారు. క్షమాభిక్ష జీఓ విడుదల చేస్తే బయటకు వెళ్లేందుకు వీరంతా అర్హులే. విడుదల కోసం నిరీక్షణ సాధారణంగా గణతంత్రదినోత్సవం (జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్ట్ 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) రోజున అర్హులైన జీవిత ఖైదీలకు ‘క్షమాభిక్ష’ ద్వారా విడుదల చేయాల్సి ఉంది. క్షమాభిక్ష జీఓ కోసం జీవితఖైదీలు నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడే శుభవార్త కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. జీఓపై ఊసెత్తని ప్రభుత్వం జీవిత ఖైదీల క్షమాభిక్షపై రాష్ట్ర సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడంతో ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 150 మంది విడుదలయ్యారు. ప్రస్తుత ప్రభు త్వం జీఓ మార్గదర్శకాల కనీసం పరిశీలించి న దాఖలాలు లేవని తెలుస్తోంది. ప్రభు త్వం స్పందించి పదేళ్ల శిక్ష పూర్తి చేసుకొన్న అర్హులైన ఖైదీలందరికీ క్షమాభిక్ష ప్రసాదించాలని పలువురు ఖైదీలు కోరుతున్నారు. అర్హుల జాబితాలో సిద్ధం ఓపెన్ ఎయిర్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఖైదీల క్షమా భిక్షకు అర్హులైన జాబితా సిద్ధం చే సుకు ని ఉంచాము. జీఓ విడుదల ప్రభు త్వం చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు క్షమాభిక్ష జీఓ విడుదల కాపీ లు అం దలేదు. ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లయితే నెల రోజుల ముందు ఓపెన్ ఎయిర్ జైలుకు సమాచారం వస్తుంది. ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారమూ రాలేదు. – నాగేశ్వరరావు, ఓపెన్ ఎయిర్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్, రెడ్డిపల్లి -
విడుదల లేనట్టే!
క్షమాభిక్ష కోసం జీవిత ఖైదీల ఎదురుచూపు పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న వారు 42 మంది జీఓ విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం క్షణికావేశంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఎంతో మంది ఖైదీలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులకు, భార్యా, బిడ్డలకు దూరమై మానసిక క్షోభకు గురయ్యారు. ఇటువంటి వారంతా క్షమాభిక్ష కింద తమను స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల చేస్తారేమో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల క్షమాభిక్ష జీఓ విడుదలలో నిర్లక్ష్యం చేస్తోంది. బుక్కరాయసముద్రం: రెడ్డిపల్లి వద్ద గల ఆరుబయలు కారాగారం (ఓపెన్ ఎయిర్ జైలు)లో వంద మంది ఖైదీలు ఉన్నారు. ఏడు సంవత్సరాల శిక్ష, మూడేళ్ల రెమ్యునేషన్ కలిసి మొత్తం పదేళ్ల శిక్ష అనుభవించిన వారు 42మంది వరకు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష జీఓ విడుదల చేస్తే స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని వీరంతా ఎదురు చూస్తున్నారు. ఆశ అడియాసేనా..? పదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న జీవిత ఖైదీలను ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) రోజున ప్రభుత్వం ‘క్షమాభిక్ష’ ద్వారా విడుదల చేస్తుంది. అయితే ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. భార్యా బిడ్డలకు దూరమయ్యా అనుకోకుండా జరిగిన తప్పిదాలకు పదేళ్లుగా భార్యా బిడ్డలకు దూరమైపోయాను. మానసికంగా ఎంతో బాధ పడుతున్నాను. కుటుంబ సభ్యులతో కలసి జీవించాలని ఉంది. క్షమాభిక్ష జీఓ కోసం రాత్రిం పగళ్లు ఎదురు చూస్తున్నాను. - గంగన్న, జీవిత ఖైదీ, పామిడి ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి జీవిత ఖైదీల క్షమాభిక్ష జీఓ విడుదల కోసం ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలి. కుటుంబాలకు దూరమై ఎంతో బాధ పడుతున్నాము. మమ్మల్ని కూడా స్వేచ్ఛా ప్రపంచంలో కలిసుండేలా కృషి చేయాలి. - శివశంకర్‌రెడ్డి, జీవిత ఖైదీ, ప్రకాశం జిల్లా అర్హుల జాబితా రెడీ ఓపెన్ ఎయిర్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించి ‘క్షమాభిక్ష’కు అర్హులైన వారి జాబితా సిద్ధం చేశాం. జీఓ విడుదల ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు క్షమాభిక్ష జీఓ విడుదలకు సంబంధించిన జీఓ కాపీలు నాకు రావడం లేదు. ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లయితే నెల రోజుల ముందు ఓపన్ ఎయిర్ జైలుకు సమాచారం వస్తుంది. - గోవిందరాజులు, సూపరింటెండెంట్, ఓపెన్ ఎయిర్ జైలు, రెడ్డిపల్లి. -
స్వేచ్ఛా ప్రపంచంలోకి జీవితఖైదీలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం సెంట్రలు నుంచి 124 మంది ఖైదీలు మంగళవారం విడుదలయ్యారు. వీరిలో 110 మంది పురుష ఖైదీలు. వీరితోపాటు మహిళా సెంట్రల్ జైలు నుంచి 14 మంది మహిళా ఖైదీలు కూడా విడుదలయ్యారు. 85 ఏళ్ల వయసుకు చేరుకుని కూడా శిక్ష అనుభవిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వృద్ధురాలు రుక్మిణమ్మ విడుదలైనవారిలో ఉండడం విశేషం. ఆమె పదమూడేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద జరిగిన లౌడు సోమన్నదొర హత్య కేసులో ఆరుగురు విడుదలయ్యారు. అలాగే గుంటూరు జిల్లా తుములగుట్టలో జరిగిన హత్య కేసులో ఏడుగురిని విడుదల చేశారు. పీజీ చదివిన ఖైదీలు శిక్ష పడి, సెంట్రల్ జైలుకు వచ్చిన తరువాత అక్కడినుంచే దూరవిద్య ద్వారా పీజీ చదువుకున్న 15 మంది ఖైదీలకు కూడా క్షమాభిక్ష లభించింది. జైలులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని పీజీ వరకూ చదివామని, దీంతోపాటు వృత్తి విద్యల్లో కూడా శిక్షణ పొందామని, దాని ద్వారా జీవనోపాధి పొందుతామని వారు పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలు జీవనోపాధి పొందేందుకు ముద్రా రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అయోమయం
రాజీవ్ హంతకులు ఏడుగురికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి విడుదల చేయూలని సీఎం జయలలిత తీసుకున్న నిర్ణయంపై గురువారం సుప్రీం కోర్టు స్టే విధించడం రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేసింది. తల్లిదండ్రులు విడుదలవుతున్నారనే ఆశతో మురుగన్, నళినీల కుమార్తె హరిద్ర లండన్ నుంచి బయలుదేరేందుకు సిద్ధపడడం ఇక్కడ చర్చనీయాంశమైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : రాజీవ్ హత్యకేసులో ఉరిశిక్ష అనుభవిస్తున్న ముగ్గురికి సుప్రీం కోర్టు క్షమాభిక్ష పెట్టి యావజ్జీవ ఖైదీలుగా అవకాశం కల్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా తమకున్న విచక్షణాధికారాలను వినియోగించి ఆ ముగ్గురితోపాటూ మొత్తం ఏడుగురికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో వెంట వెంటనే ఈపరిణామాలు చోటు చేసుకున్నారుు. అరుుతే మూడోరోజుకల్లా పరిస్థితి తారుమారైంది. సీబీఐ విచారించిన కేసులో కేంద్రం అనుమతి లేకుండా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విడుదలపై స్టే అమల్లోకి వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు యథాతథ స్థితి కొనసాగాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమ్మానాన్నల కోసం హరిద్ర లండన్‌లో బయోమెడిసిన్ చదువుకుంటున్న మురుగన్, నళినీల కుమార్తె హరిద్ర తన తల్లిదండ్రులు జైలు నుంచి విడుదల కాబోతున్నారన్న ఆనందంతో చెన్నైకి బయలుదేరే ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మురుగన్, నళినీలు నవ వధువులుగానే రాజీవ్ హత్యకేసులో అరెస్టయి జైలు పాలయ్యారు. నళినీ చెంగల్పట్టు జైలులో ఉండగా ఐదో నెల గర్భంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవమాసాలు నిండిన తరువాత ఆడబిడ్డ పుట్టగా హరిద్ర అని పేరుపెట్టారు. ఆ తరువాత నళినీని సేలం జైలుకు మార్చగా తల్లితోపాటూ హరిద్రకూడా జైలులోనే పెరగసాగింది. తన బిడ్డను జైలు గోడల నుంచి పంపివేయాలని భావించిన నళినీ రాజీవ్ హత్య కేసులోనే శిక్షను అనుభవిస్తున్న తోటి ఖైదీ సచీంద్రన్ సాయంతో అతని తల్లికి రెండున్నరేళ్ల హరిద్రను అప్పగించింది. కొన్నాళ్లు కోవైలో ఆ తరువాత ఈలంలో పెరిగిన హరిద్ర 2005లో లండన్‌కు చేరుకుంది. ప్రస్తుతం 22 ఏళ్లు వచ్చిన హరిద్ర లండన్‌లోనే ఉంటూ బయోమెడిసిన్ విద్యను అభ్యసిస్తోంది. తల్లిదండ్రులు విడుదలవుతున్నారని తెలుసుకున్న హరిద్ర పట్టలేని ఆనందంతో చెన్నైకి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఊహ తెలిసిన తరువాత తొలిసారిగా జైలు గోడల వెలుపల తల్లిదండ్రులను కలవబోతున్నట్లు హరిద్ర ఆనందం వ్యక్తం చేసింది. రాజకీయ చదరంగం ః జ్ఞానదేశికన్ ఏడుగురు రాజీవ్ హంతకులను విడుదల చేయాలని భావించడం ద్వారా కొన్ని పార్టీలు రాజకీయ చదరంగం ఆడుతున్నాయని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ వ్యాఖ్యానించారు. ముగ్గురికి క్షమాభిక్ష పెట్టాలని డీఎంకే కోరితే, తాను ఏకంగా ఏడుగురికి వరమిచ్చానని సీయం జయలలిత గర్వంగా ప్రకటించుకునట్లు ఆయన విమర్శించారు. కేంద్రం అనుమతి లేకుండా జైలు నుంచి విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ఖైదీల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన నేతలు రాజీవ్ హత్యపై విచారం తెలపలేదేమని ఆయన ప్రశ్నించారు. ఎల్టీటీఈకి చెందిన ఈ ఏడుగురు విడుదలైతే వారు ఎక్కడ ఉంటారు, వారి ప్రాణాలకు జయ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందా అని జ్ఞానదేశికన్ ప్రశ్నించారు.