అయోమయం
రాజీవ్ హంతకులు ఏడుగురికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి విడుదల చేయూలని సీఎం జయలలిత తీసుకున్న నిర్ణయంపై గురువారం సుప్రీం కోర్టు స్టే విధించడం రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేసింది. తల్లిదండ్రులు విడుదలవుతున్నారనే ఆశతో మురుగన్, నళినీల కుమార్తె హరిద్ర లండన్ నుంచి బయలుదేరేందుకు సిద్ధపడడం ఇక్కడ చర్చనీయాంశమైంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి :
రాజీవ్ హత్యకేసులో ఉరిశిక్ష అనుభవిస్తున్న ముగ్గురికి సుప్రీం కోర్టు క్షమాభిక్ష పెట్టి యావజ్జీవ ఖైదీలుగా అవకాశం కల్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా తమకున్న విచక్షణాధికారాలను వినియోగించి ఆ ముగ్గురితోపాటూ మొత్తం ఏడుగురికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో వెంట వెంటనే ఈపరిణామాలు చోటు చేసుకున్నారుు. అరుుతే మూడోరోజుకల్లా పరిస్థితి తారుమారైంది. సీబీఐ విచారించిన కేసులో కేంద్రం అనుమతి లేకుండా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విడుదలపై స్టే అమల్లోకి వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు యథాతథ స్థితి కొనసాగాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అమ్మానాన్నల కోసం హరిద్ర
లండన్‌లో బయోమెడిసిన్ చదువుకుంటున్న మురుగన్, నళినీల కుమార్తె హరిద్ర తన తల్లిదండ్రులు జైలు నుంచి విడుదల కాబోతున్నారన్న ఆనందంతో చెన్నైకి బయలుదేరే ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మురుగన్, నళినీలు నవ వధువులుగానే రాజీవ్ హత్యకేసులో అరెస్టయి జైలు పాలయ్యారు. నళినీ చెంగల్పట్టు జైలులో ఉండగా ఐదో నెల గర్భంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవమాసాలు నిండిన తరువాత ఆడబిడ్డ పుట్టగా హరిద్ర అని పేరుపెట్టారు. ఆ తరువాత నళినీని సేలం జైలుకు మార్చగా తల్లితోపాటూ హరిద్రకూడా జైలులోనే పెరగసాగింది. తన బిడ్డను జైలు గోడల నుంచి పంపివేయాలని భావించిన నళినీ రాజీవ్ హత్య కేసులోనే శిక్షను అనుభవిస్తున్న తోటి ఖైదీ సచీంద్రన్ సాయంతో అతని తల్లికి రెండున్నరేళ్ల హరిద్రను అప్పగించింది. కొన్నాళ్లు కోవైలో ఆ తరువాత ఈలంలో పెరిగిన హరిద్ర 2005లో లండన్‌కు చేరుకుంది. ప్రస్తుతం 22 ఏళ్లు వచ్చిన హరిద్ర లండన్‌లోనే ఉంటూ బయోమెడిసిన్ విద్యను అభ్యసిస్తోంది. తల్లిదండ్రులు విడుదలవుతున్నారని తెలుసుకున్న హరిద్ర పట్టలేని ఆనందంతో చెన్నైకి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఊహ తెలిసిన తరువాత తొలిసారిగా జైలు గోడల వెలుపల తల్లిదండ్రులను కలవబోతున్నట్లు హరిద్ర ఆనందం వ్యక్తం చేసింది.
రాజకీయ చదరంగం ః జ్ఞానదేశికన్
ఏడుగురు రాజీవ్ హంతకులను విడుదల చేయాలని భావించడం ద్వారా కొన్ని పార్టీలు రాజకీయ చదరంగం ఆడుతున్నాయని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ వ్యాఖ్యానించారు. ముగ్గురికి క్షమాభిక్ష పెట్టాలని డీఎంకే కోరితే, తాను ఏకంగా ఏడుగురికి వరమిచ్చానని సీయం జయలలిత గర్వంగా ప్రకటించుకునట్లు ఆయన విమర్శించారు. కేంద్రం అనుమతి లేకుండా జైలు నుంచి విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ఖైదీల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన నేతలు రాజీవ్ హత్యపై విచారం తెలపలేదేమని ఆయన ప్రశ్నించారు. ఎల్‌టీటీఈకి చెందిన ఈ ఏడుగురు విడుదలైతే వారు ఎక్కడ ఉంటారు, వారి ప్రాణాలకు జయ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందా అని జ్ఞానదేశికన్ ప్రశ్నించారు.