Rajiv murder case
-
సుప్రీం కోర్టుని ఆశ్రయించిన నళిని
న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషి నళిని తనను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే కేసుల దోషిగా ఉన్న ఏజీ పేరారివాలన్ విడుల చేయాలని సుప్రీం కోర్టు ఆశ్రయించిన నెలరోజుల తర్వాత నళిని తనకు కూడా ఈ కేసు నుంచి ఉపశమనం కావాలంటు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరుకు మే 18న పెరారివాలన్‌కి సుప్రీం కోర్టు విడుదల మంజూరు చేయడంతో ఈ కేసు నుంచి కాస్త ఉపశమనం పొందాడు. దీంతో ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, రవిచంద్రన్‌లు తమకు కూడా ఉపశమనం కావాలంటూ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. పైగా నళిని 31 ఏళ్లు పైగా జైలు జీవితాన్ని అనుభవించానని కాబట్లి ఇక తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు. ఐతే 2015 నుంచి తమిళనాడు గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ మేరకు నళిని తరుపు న్యాయవాది మాట్లాడుతూ...నళిని తనను విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తాము దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్ల పేర్కొన్నారు. పైగా 2018లోనే తమిళనాడు మంత్రి మండలి రాజీవ్ గాంధీ కేసులో దోషులను విడుదల చేయాలని గవర్నర్‌కి సిఫార్సు చేసిందని చెప్పారు. కానీ గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా ఆ సిఫార్సును రాష్ట్రపతికి పంపించారని అన్నారు. ఐతే పెరారివాలన్‌కి సుప్రీం కోర్టు విడుదల మంజూరు చేసినప్పడూ నళిని, రవిచంద్రన్‌లు కూడా అతని తోపాటు సమానంగా ఈ కేసు నుంచి ఉపశమనం ఇవ్వాలని నళిని తరుఫు న్యాయవాది అన్నారు. వాస్తవానికి ఇదే కేసులోని మిగిలిన దోషులు నళిని, మురుగన్, సంతన్, రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్ పాయస్ల కేసును పరిశీలిస్తామని తమిళనాడు ప్రభుత్వం మే నెలలో పేర్కొంది. కానీ ఇంతవరకు ఆ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి, నళిని, రవిచంద్రన్‌లు మాత్రమే విడుదల కోసం సుప్రీం కోర్టుకి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే పెరారివాలన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ ఆలస్యం చేయడంతో సుప్రీం కోర్టు అతని కేసుని పరిగణలోకి తీసుకుంది. పైగా మంత్రిమండలి సిఫార్సుకి కట్టుబడి ఉంటామంటూ, ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాన్ని వినియోగించి ధర్మాసనం పెరారివాలన్‌ని విడుదల చేసింది కాని ఇదే విధానం మిగతా దోషులకు వర్తించకపోవచ్చు. (చదవండి: నళినికి నెల రోజుల పెరోల్) -
నళినికి నెల రోజుల పెరోల్
సాక్షి, చెన్నై: రాజీవ్‌హత్య కేసులో దోషి నళినికి నెల రోజులు పెరోల్ మంజూరైంది. ఈ కేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఏడుగురిలో నళిని ఒకరు. వీరిని ముందస్తుగా విడుదల చేయాలని తమిళనాడు కేబినెట్ 2018లో గవర్నర్‌కు సిఫారసు చేసినా రాజ్‌భవన్ నుంచి నిర్ణయం వెలువడలేదు. దాంతో గవర్నర్ అనుమతి లేకుండా తనను ముందస్తుగా విడుదల చేయాలని నళిని తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నళిని తరఫున తల్లి పద్మ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఈ దశలో కూతురు తనతో ఉండాలని కోరుకుంటున్నానని, పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ గురువారం న్యాయమూర్తులు వీఎన్ ప్రకాష్, ఆర్. హేమలత బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. నళినికి నెల రోజులు పెరోల్ ఇవ్వడానికి తమిళనాడు సర్కారు నిర్ణయించినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నళినికి పెరోల్ మంజూరైంది. -
పునఃసమీక్ష!
సాక్షి, చెన్నై : రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదల కోసం మరో ప్రయత్నంగా పునఃసమీక్ష పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. వారి విడుదలను కాంక్షిస్తూ గత తీర్పు పునఃసమీక్షకు పట్టుబట్టే పనిలో అమ్మ సర్కారు నిమగ్నమైంది. కేంద్రం ఆలోచనను స్వీకరించాలే గానీ, అనుమతి అవసరం లేదని ఆ పిటిషన్లో స్పష్టం చేశారు.మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శాంతన్, మురుగన్, పేరరివాలన్, నళినిలతో పాటు ఏడుగురు ఏళ్ల తరబడి వేలూరు కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వీరి ఉరి శిక్ష యావజ్జీవంగా మారింది. అయితే, యావజ్జీవం కన్నా, ఎక్కువగానే వీరు జైలు జీవితాన్ని అనుభవించి ఉన్నారన్న వాదనలు తెర మీదకు రావడంతో విడుదల నినాదం ఊపందుకుంది. ఈ ఏడుగురి విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే ప్రయత్నిస్తూ వస్తున్నది. వారి విడుదల వ్యవహారంలో కేంద్రం ఆలోచన స్వీకరించేందుకు తగ్గ కసరత్తులు జరిగాయి. గత ఏడాది ఆ ఏడుగురిని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. దీనిని రాజకీయ శాసనాల బెంచ్ విచారించి, కేసు విచారణను సీబీఐ సాగించి ఉన్న దృష్ట్యా, ఆ ఏడుగురిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ఏడుగురి విడుదల మళ్లీ వెనక్కు వెళ్లింది. ఆ ఏడుగురిని విడుదల చేయించడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న అమ్మ జయలలిత ప్రభుత్వం మరో మారు తీర్పును పునఃసమీక్షించే విధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనుమతి అవసరం లేదు : రాష్ర్ట ప్రభుత్వం తరఫున బుధవారం సుప్రీంకోర్టులో పునఃసమీక్ష పిటిషన్ దాఖలైంది. రాజీవ్ హత్య కేసు నిందితుల గురించి వివరిస్తూ, 25 ఏళ్లకు పైగా వారు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నట్టు గుర్తుచేశారు. వారి విడుదలకు కేంద్రం ఆలోచనను స్వీకరించాల్సిన అవసరం ఉందే గానీ, అనుమతి తప్పనిసరి కాదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అందులో వివరించారు. వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని సూచించారు. రాజకీయ శాసనాల బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించి, ఆ ఏడుగురి విడుదలకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. -
అయోమయం
రాజీవ్ హంతకులు ఏడుగురికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి విడుదల చేయూలని సీఎం జయలలిత తీసుకున్న నిర్ణయంపై గురువారం సుప్రీం కోర్టు స్టే విధించడం రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేసింది. తల్లిదండ్రులు విడుదలవుతున్నారనే ఆశతో మురుగన్, నళినీల కుమార్తె హరిద్ర లండన్ నుంచి బయలుదేరేందుకు సిద్ధపడడం ఇక్కడ చర్చనీయాంశమైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : రాజీవ్ హత్యకేసులో ఉరిశిక్ష అనుభవిస్తున్న ముగ్గురికి సుప్రీం కోర్టు క్షమాభిక్ష పెట్టి యావజ్జీవ ఖైదీలుగా అవకాశం కల్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా తమకున్న విచక్షణాధికారాలను వినియోగించి ఆ ముగ్గురితోపాటూ మొత్తం ఏడుగురికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో వెంట వెంటనే ఈపరిణామాలు చోటు చేసుకున్నారుు. అరుుతే మూడోరోజుకల్లా పరిస్థితి తారుమారైంది. సీబీఐ విచారించిన కేసులో కేంద్రం అనుమతి లేకుండా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, విడుదలపై స్టే అమల్లోకి వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు యథాతథ స్థితి కొనసాగాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమ్మానాన్నల కోసం హరిద్ర లండన్‌లో బయోమెడిసిన్ చదువుకుంటున్న మురుగన్, నళినీల కుమార్తె హరిద్ర తన తల్లిదండ్రులు జైలు నుంచి విడుదల కాబోతున్నారన్న ఆనందంతో చెన్నైకి బయలుదేరే ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మురుగన్, నళినీలు నవ వధువులుగానే రాజీవ్ హత్యకేసులో అరెస్టయి జైలు పాలయ్యారు. నళినీ చెంగల్పట్టు జైలులో ఉండగా ఐదో నెల గర్భంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవమాసాలు నిండిన తరువాత ఆడబిడ్డ పుట్టగా హరిద్ర అని పేరుపెట్టారు. ఆ తరువాత నళినీని సేలం జైలుకు మార్చగా తల్లితోపాటూ హరిద్రకూడా జైలులోనే పెరగసాగింది. తన బిడ్డను జైలు గోడల నుంచి పంపివేయాలని భావించిన నళినీ రాజీవ్ హత్య కేసులోనే శిక్షను అనుభవిస్తున్న తోటి ఖైదీ సచీంద్రన్ సాయంతో అతని తల్లికి రెండున్నరేళ్ల హరిద్రను అప్పగించింది. కొన్నాళ్లు కోవైలో ఆ తరువాత ఈలంలో పెరిగిన హరిద్ర 2005లో లండన్‌కు చేరుకుంది. ప్రస్తుతం 22 ఏళ్లు వచ్చిన హరిద్ర లండన్‌లోనే ఉంటూ బయోమెడిసిన్ విద్యను అభ్యసిస్తోంది. తల్లిదండ్రులు విడుదలవుతున్నారని తెలుసుకున్న హరిద్ర పట్టలేని ఆనందంతో చెన్నైకి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఊహ తెలిసిన తరువాత తొలిసారిగా జైలు గోడల వెలుపల తల్లిదండ్రులను కలవబోతున్నట్లు హరిద్ర ఆనందం వ్యక్తం చేసింది. రాజకీయ చదరంగం ః జ్ఞానదేశికన్ ఏడుగురు రాజీవ్ హంతకులను విడుదల చేయాలని భావించడం ద్వారా కొన్ని పార్టీలు రాజకీయ చదరంగం ఆడుతున్నాయని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ వ్యాఖ్యానించారు. ముగ్గురికి క్షమాభిక్ష పెట్టాలని డీఎంకే కోరితే, తాను ఏకంగా ఏడుగురికి వరమిచ్చానని సీయం జయలలిత గర్వంగా ప్రకటించుకునట్లు ఆయన విమర్శించారు. కేంద్రం అనుమతి లేకుండా జైలు నుంచి విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ఖైదీల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన నేతలు రాజీవ్ హత్యపై విచారం తెలపలేదేమని ఆయన ప్రశ్నించారు. ఎల్టీటీఈకి చెందిన ఈ ఏడుగురు విడుదలైతే వారు ఎక్కడ ఉంటారు, వారి ప్రాణాలకు జయ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందా అని జ్ఞానదేశికన్ ప్రశ్నించారు. -
పెరోల్ ఇవ్వండి
సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితురాలు నళిని పెరోల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. నెల రోజులు తనకు పెరోల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌తో సహా నళినికి ఉరి శిక్ష పడిన విషయం తెలిసిందే. కొన్నాళ్లకు ఆమె ఉరి శిక్ష యావజ్జీవంగా మారింది. రాజీవ్ గాంధీ కుటుంబం కరుణించడంతోనే ఆమెకు శిక్ష తగ్గిందని చెప్పవచ్చు. నళినిని కలుసుకునేందుకు రాజీవ్ కుమార్తె ప్రియాంక గాంధీ వేలూరు జైలుకు సైతం వచ్చారు. ఇది వరకు మూడు రోజులు నళిని పెరోల్ మీద బయటకు వచ్చారు కూడా. అదే సమయంలో 22 ఏళ్లుగా కటకటాల్లో ఉన్న తనను విడుదల చేయాలని కోరుతూ నళిని కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఆమె విడుదల పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, భర్త మురుగన్‌ను నెలకో సారి కలుసుకునే అవకాశం మాత్రం ఆమెకు దక్కింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఉరి శిక్షను ఎదుర్కొంటున్న ఖైదీల్లో ఆనందాన్ని నింపే విధంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఇక తమకు ఉరి తప్పిందన్న ఆనందంలో రాజీవ్ హత్య కేసు నిందితులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా నెల రోజుల పాటు పెరోల్ మీద బయటకు వచ్చేందుకు నళిని నిర్ణయించారు. తనను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ వేగవంతం చేయడంతోపాటుగా, పెరోల్ మీద బయటకు వచ్చి కొంతకాలం తన కుమార్తె, కుటుంబంతో కలసి ఉండేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పిటిషన్: 22 ఏళ్లుగా తాను వేలూరు కేంద్ర కారాగారంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నట్టు పిటిషన్లో నళిని వివరించారు. తన తండ్రి తంగనారాయణన్ (90) తిరునల్వేలి జిల్లా అంబలవానన్ పురంలో నివాసం ఉంటున్నారని గుర్తు చేశారు. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు తోడుగా మరెవ్వరూ లేరని పేర్కొన్నారు. తాను ఆయనతో కొన్నాళ్లు ఉండి, ఆరోగ్య పరంగా సేవలను అందించేందుకు ఆశ పడుతున్నట్టు వివరించారు. తనకు నెల రోజులు పెరోల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇది వరకు తాను మూడు రోజులు పెరోల్ మీద బయటకు వచ్చానని గుర్తు చేశారు. తన తండ్రి కోసం పెరోల్ ఇవ్వాలని వేడుకున్నారు. ఈపిటిషన్ను న్యాయమూర్తులు రాజేశ్వరన్, ప్రకాష్ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించింది. విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. అదే రోజు రాష్ర్ట ప్రభుత్వం, జైళ్ల శాఖ, కేసు సంబంధిత అధికారులు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసును న్యాయమూర్తులు జారీ చేశారు.