పెరోల్ ఇవ్వండి
Published Thu, Jan 23 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితురాలు నళిని పెరోల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. నెల రోజులు తనకు పెరోల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మురుగన్, శాంతన్, పేరరివాలన్‌తో సహా నళినికి ఉరి శిక్ష పడిన విషయం తెలిసిందే. కొన్నాళ్లకు ఆమె ఉరి శిక్ష యావజ్జీవంగా మారింది. రాజీవ్ గాంధీ కుటుంబం కరుణించడంతోనే ఆమెకు శిక్ష తగ్గిందని చెప్పవచ్చు. నళినిని కలుసుకునేందుకు రాజీవ్ కుమార్తె ప్రియాంక గాంధీ వేలూరు జైలుకు సైతం వచ్చారు. ఇది వరకు మూడు రోజులు నళిని పెరోల్ మీద బయటకు వచ్చారు కూడా. అదే సమయంలో 22 ఏళ్లుగా కటకటాల్లో ఉన్న తనను విడుదల చేయాలని కోరుతూ నళిని కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఆమె విడుదల పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
అయితే, భర్త మురుగన్‌ను నెలకో సారి కలుసుకునే అవకాశం మాత్రం ఆమెకు దక్కింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఉరి శిక్షను ఎదుర్కొంటున్న ఖైదీల్లో ఆనందాన్ని నింపే విధంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఇక తమకు ఉరి తప్పిందన్న ఆనందంలో రాజీవ్ హత్య కేసు నిందితులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా నెల రోజుల పాటు పెరోల్ మీద బయటకు వచ్చేందుకు నళిని నిర్ణయించారు. తనను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ వేగవంతం చేయడంతోపాటుగా, పెరోల్ మీద బయటకు వచ్చి కొంతకాలం తన కుమార్తె, కుటుంబంతో కలసి ఉండేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పిటిషన్: 22 ఏళ్లుగా తాను వేలూరు కేంద్ర కారాగారంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నట్టు పిటిషన్‌లో నళిని వివరించారు.
తన తండ్రి తంగనారాయణన్ (90) తిరునల్వేలి జిల్లా అంబలవానన్ పురంలో నివాసం ఉంటున్నారని గుర్తు చేశారు. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు తోడుగా మరెవ్వరూ లేరని పేర్కొన్నారు. తాను ఆయనతో కొన్నాళ్లు ఉండి, ఆరోగ్య పరంగా సేవలను అందించేందుకు ఆశ పడుతున్నట్టు వివరించారు. తనకు నెల రోజులు పెరోల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇది వరకు తాను మూడు రోజులు పెరోల్ మీద బయటకు వచ్చానని గుర్తు చేశారు. తన తండ్రి కోసం పెరోల్ ఇవ్వాలని వేడుకున్నారు. ఈపిటిషన్‌ను న్యాయమూర్తులు రాజేశ్వరన్, ప్రకాష్ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించింది. విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. అదే రోజు రాష్ర్ట ప్రభుత్వం, జైళ్ల శాఖ, కేసు సంబంధిత అధికారులు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసును న్యాయమూర్తులు జారీ చేశారు.
Advertisement