గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం సెంట్రలు నుంచి 124 మంది ఖైదీలు మంగళవారం విడుదలయ్యారు. వీరిలో 110 మంది పురుష ఖైదీలు. వీరితోపాటు మహిళా సెంట్రల్ జైలు నుంచి 14 మంది మహిళా ఖైదీలు కూడా విడుదలయ్యారు.
85 ఏళ్ల వయసుకు చేరుకుని కూడా శిక్ష అనుభవిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వృద్ధురాలు రుక్మిణమ్మ విడుదలైనవారిలో ఉండడం విశేషం. ఆమె పదమూడేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద జరిగిన లౌడు సోమన్నదొర హత్య కేసులో ఆరుగురు విడుదలయ్యారు. అలాగే గుంటూరు జిల్లా తుములగుట్టలో జరిగిన హత్య కేసులో ఏడుగురిని విడుదల చేశారు.
పీజీ చదివిన ఖైదీలు
శిక్ష పడి, సెంట్రల్ జైలుకు వచ్చిన తరువాత అక్కడినుంచే దూరవిద్య ద్వారా పీజీ చదువుకున్న 15 మంది ఖైదీలకు కూడా క్షమాభిక్ష లభించింది. జైలులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని పీజీ వరకూ చదివామని, దీంతోపాటు వృత్తి విద్యల్లో కూడా శిక్షణ పొందామని, దాని ద్వారా జీవనోపాధి పొందుతామని వారు పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలు జీవనోపాధి పొందేందుకు ముద్రా రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.