కమీషన్ల కోసమే ‘ఎత్తిపోతలు’
కమీషన్ల కోసమే ‘ఎత్తిపోతలు’
Published Sun, Aug 7 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
చినకొండేపూడి (సీతానగరం) : కమీషన్ల కోసమే టీడీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు 63వ జయంతి సందర్భంగా.. చినకొండేపూడిలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎత్తిపోతల పథకాలను ఎందుకు నిర్మిస్తోందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.1500 కోట్ల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంతో ఎంతవరకూ లబ్ధి కలుగుతుందో తెలియజేయాలన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల పేరుతో దాదాపు రూ.3,500 కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి బదులు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే పనులు పూర్తయ్యేవని, దీంతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీరు వెళ్లేదని కన్నబాబు అన్నారు. స్పిల్‌వే పూర్తి చేయకుండా, ఈ రెండు ఎత్తిపోతల పథకాలపై ఇంత శ్రద్ధ ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకాలను నిర్మించడంతో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. నిధులు ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.1800 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తవ్విన కాలువలు ఉపయోగించుకుని, కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం చేసినట్టు గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. చాగల్నాడు నుంచి 35 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా, 8 వేల ఎకరాలకు మాత్రమే నీరందిస్తున్నారన్నారు. ఇసుక మేటలు వేయడంతో కాటవరం పంపింగ్ స్కీమ్ నిలిచిపోయిందని, దీనిని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలతో జేబులు నింపుకున్నారని కన్నబాబు ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర యువజన కార్యదర్శి ఎల్.రవి, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement