తాత్కాలిక సచివాలయంలో ‘ఎత్తిపోతలు’ | ' lift irrigation ' in interim Secretariat | Sakshi

తాత్కాలిక సచివాలయంలో ‘ఎత్తిపోతలు’

Jul 19 2016 8:34 PM | Updated on Aug 18 2018 3:49 PM

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం చుట్టూ వర్షపు నీరు చేరింది.

- కొద్దిపాటి వర్షానికే చుట్టూ చేరిన నీరు.. మోటార్లతో తోడకం
- సీఎం చంద్రబాబు పర్యటన మళ్లీ వాయిదా
- రేపు ఐదో భవనం మొదటి అంతస్తు ప్రారంభం

సాక్షి, అమరావతి
 వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం చుట్టూ వర్షపు నీరు చేరింది. ఆ నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా భూముల్లోకి పంపింగ్ చేయిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం బురుదమయంగా మారడంతో మంగళవారం ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వాయిదా వేశారు. వర్షం కారణంగా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు రెండ్రోజులుగా మందగించాయి. సోమవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే ఆ ప్రాంతం చెరువును తలపిస్తోంది.

 

పల్లపు ప్రాంతం కావటం... నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని మెరక చేసిన దాఖలాలు లేకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఇంజనీర్లు చెబుతున్నారు. హడావుడి పనులతో సౌకర్యాలు సమకూర్చటంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్ మోటార్లతో తోడిస్తున్నారు. ఆ నీటిని చిన్న సైజు కాలువల ద్వారా చేలల్లోకి మళ్లిస్తున్నారు. నీటిని తోడిన కొంత సమయానికి అదే గుంతల్లోకి మళ్లీ నీరు వచ్చి చేరుతోంది. వర్షం వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక సచివాలయం మురికి గుంతను తలపిస్తుంటే.. భారీ వర్షం వస్తే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతనెల 29న పలువురు మంత్రులు ఐదో భవనం గ్రౌండ్ ఫ్లోర్‌ను ప్రారంభించారు. ఆరోజు కూడా ఇక్కడ బురదగుంతను తలిపించింది.

 

హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదో భవనం మొదటి అంతస్తు ప్రారంభం కోసం గురువారం ముహూర్తం ఖరారు చేశారు. అందులో భాగంగా ఐదవ భవనం మొదటి అంతస్తు, అసంపూర్తిగా ఉన్న గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణ పనులు పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. నిర్మాణ పనులను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు మంగళవారం వెలగపూడి వస్తున్నారని అధికారులు ప్రకటించారు. మొత్తం బురదమయంగా మారటంతో పర్యటనను వాయిదా వేశారు. గతంలోనూ రెండు పర్యాయాలు సీఎం పర్యటన వాయిదా పడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement