భవనాల ఎత్తుకు క్యాప్ పెట్టండి!
‘ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) పరిమితులు ఉన్నాయి. కానీ, ఔటర్ రింగ్ రోడ్డు వరకూ స్థలాల లభ్యత ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేవు. దీంతో రోడ్డు, స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా బిల్డర్లు ఇష్టారాజ్యంగా హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో భూములు, అపార్ట్మెంట్ల ధరలు పెరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలో భవన నిర్మాణాలు ఉండటంతో రోడ్లపై వాహనాల రద్దీ, కాలుష్యం పెరగడంతో పాటు విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడుతుంది’ అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఎం.ప్రేమ్‌కుమార్ అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక వసతులు, డిమాండ్ ఉన్న ప్రాంతంలో తక్కువ స్థలం దొరికినా చాలు బిల్డర్లు హైరైజ్ భవనాలు కట్టేస్తున్నారు. దీంతో స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు పెరగడం తప్ప సమాంతర అభివృద్ధి జరగడం లేదు. నగరాభివృద్ధికి ఆకాశహర్మ్యలే ప్రతీక. ఆర్థికంగా, సాంకేతికంగా మనం ఎంత శక్తిమంతులమో ఇవి నిరూపిస్తాయి. అలా అని రోడ్డు, మౌలిక సదుపాయాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయకుండా అనుమతులు ఇవ్వకూడదు. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు ఉంటేనే బిల్డర్లు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా ఓఆర్ఆర్ చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంతాల వైపు దృష్టిసారిస్తారు. దీంతో ధరలు తగ్గి, సామాన్యుల సొంతింటి కల సాకారం అవుతుంది. నార్సింగి, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో కనీసం నివాస భవనాలకైనా ఎఫ్ఎప్ఐపై క్యాప్ పెట్టాలి.మూసీ పరిహారంగా స్థలాలు..గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హైదరాబాద్‌లో కంపుకొట్టే మూసీ నది ఉండటం శోచనీయం. విదేశీ పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షించాలంటే మూసీ సుందరీకరణ అనివార్యం. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయం. అయితే మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను ఒప్పించి ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మూసీ బాధితులకు శివారు ప్రాంతంలో ప్రభుత్వమే లేఔట్ చేసి, 60–80 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించాలి. దీంతో వాళ్లే సొంతంగా ఇళ్లు కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణతో రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. రోడ్ల మీద వాహనాల రద్దీతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. మెరుగైన రవాణాతో నగరం సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..చెరువుల్లో పట్టా భూములు..చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా ఉద్దేశం మంచిదే. కానీ, ప్రభుత్వం దీన్ని సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇప్పటికీ గ్రేటర్లో చాలా చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ప్రభుత్వం నిర్ధారించలేదు. అయినా ఆగమేఘాల మీద బుల్డోజర్లతో కూల్చివేతలు చేశారు. అలా కాకుండా ముందుగా చెరువులకు కంచె వేసి, బఫర్ జోన్లను నిర్ధారించాలి. గ్రేటర్‌లోని చాలా చెరువుల్లో పట్టా భూములు ఉన్నాయి. ఆయా భూయజమానులకు 400 శాతం ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) భూములను స్వాధీనం చేసుకోవాలి. ఈ విధానాన్ని హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలి. అప్పుడే బాధితులు ముందుకొస్తారు. గతంలో కొనుగోలుదారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందా అడిగేవారు కానీ ఇప్పుడు హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు.