ఎనిమిది మందికి యావజ్జీవ శిక్ష
ఎనిమిది మందికి యావజ్జీవ శిక్ష
Published Thu, Jan 5 2017 10:19 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
- హత్య కేసులో ఆదోని కోర్టు సంచలన తీర్పు
- ముద్దాయిలు అందరూ దాయాదులే
ఆదోని/రూరల్ : ఆదోని 2వ అదనపు జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఆస్పరి మండలంలోని అట్టెకల్లు గ్రామానికి చెందిన బోయ జల్లి బుడుబుడుకుల ఆంజినేయ(58) హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు చెప్పారు. ఆదోని కోర్టులో వ్యక్తి హత్య కేసులో ఎనిమిది మందికి శిక్ష విధించడం ఇదే ప్రథమం. డీఎస్సీ కొల్లి శ్రీనివాసరావు ఇస్వి పోలీసు స్టేషనులో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలు వివరించారు. 2011 ఆగస్టు 17న సాయంత్రం అదే గ్రామానికి చెందిన బోయ జల్లి బుడుబుడుకుల ఆంజినేయ(58) హత్యకు గురి అయ్యాడు. ప్రత్యర్థులు వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. హతుడి సోదరుడు కౌలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పరి పోలీసులు అదే గ్రామానికి చెందిన బోయ పత్తికొండ జయరాముడు, లక్ష్మన్న, నర్సన్న, చిన్న నరసన్న, నౌనెపాటి, లింగన్న, పెద్ద సంజన్న, చిన్న సంజన్నపై కేసు నమోదు చేశారు. వీరంతా అన్నదమ్ముల సంతానం. అరెస్ట్ తరువాత నిందితులు బెయిలుపై విడుదల అయ్యారు. ఐదు సంవత్సరాలకు పైగా కోర్టులో కేసు విచారణ జరిగింది. బాధితుల తరుపున పీపీ రఫత్ వాదన వినిపించారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.400 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
కనువిప్పు కావాలి
ఆంజినేయ హత్య కేసు తీర్పు అసాంఘిక శక్తులు, హత్యలకు పాల్పడే వారికి కనువిప్పు కావాలని డీఎస్సీ కొల్లి శ్రీనివాసరావు అన్నారు. హత్య కేసులో నిందితులుగా ఉన్న వారు జైలు పాలు కావడంతో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల పాలయ్యాయని అన్నారు. నేరం చేసే ముందు ఒక్క క్షణం కుటుంబం గురించి ఆలోచిస్తే వెంటనే మారిపోతారని పేర్కొన్నారు. కేసును సాక్షాధారాలతో కోర్టులో రుజువు చేసిన ఆస్పరి పోలీసులను ఆయన అభినందించారు. ఏదైనా అన్యాయం జరిగిందనుకుంటే పోలీసులు, కోర్టును ఆశ్రయించాలే తప్ప ప్రతీకారాలకు పోకూడదని సూచించారు.
అందరూ వయస్సు పైబడిన వారే
శిక్షకు గురైన వారిలో అందరూ వయస్సు పైబడిన వారే. అన్నదమ్ముల సంతానమే వీరిలో చిన్న నరసన్న, నర్సన్న .. పెద్ద సంజన్న, చిన్న సంజన్న.. నౌనెపాటి, లింగన్న స్వయానా అన్నదమ్ములు. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న వారు జైలు పాలు కావడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించడం పలువురిని కలిచివేసింది.
చిచ్చురేపిన కుందేలు వేట
దాదాపు 30 ఏళ్ల క్రితం కుందేలు వేటలో వచ్చిన విభేదాలే చిలికి చిలికి గాలి వానలా మారాయి. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టాయి. ప్రతీకారాలకు ఇరు వర్గాల నుంచి ముగ్గురు హత్యకు గురి కాగా ఎనిమిది మంది జైలు పాలయ్యారు. ప్రతీకార జ్వాలలు కుటుంబాలను దహించి వేస్తాయని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
Advertisement
Advertisement