రేషన్‌కు కత్తెర | Lifting of goods | Sakshi
Sakshi News home page

రేషన్‌కు కత్తెర

Published Tue, May 16 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

రేషన్‌కు కత్తెర

రేషన్‌కు కత్తెర

చౌకదుకాణాల్లో ఒక్కొక్కటిగా సరుకుల నిలిపివేత
గతంలో ఎనిమిది రకాలంటూ ఆర్భాటం
ఇప్పుడు బియ్యం మాత్రమే ఇచ్చేలా ఏర్పాట్లు
లబోదిబోమంటున్న  కార్డుదారులు


‘తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ప్రతి పేదవాడికీ చౌకదుకాణాల ద్వారా తక్కువ ధరకే సరుకులు అందిస్తాం.. పెద్దోళ్లతో సమానంగా ప్రతి పేదవాడూ పండగ చేసుకునేలా ఉచిత సరుకులు అందిస్తాం’ అంటూ గొప్పలు చెప్పిన పాలకులు ఇప్పుడు వచ్చేవాటిలోనూ ఒక్కొక్కటిగా కోత విధించే పనిలో పడ్డారు. సబ్సిడీ భరించలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయగా.. సరుకులు ఇవ్వలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం వంతపాడుతోంది. వచ్చే నెల నుంచి చౌకదుకాణాల ద్వారా బియ్యం మాత్రమే సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. చక్కెర, కిరోసిన్‌ కోటా పూర్తిగా నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది.

సాక్షి: నిరుపేదల ప్రజాపంపిణీ వ్యవస్థపై సర్కారు కన్నుపడింది. సబ్సిడీ ధరలతో అందిస్తున్న సరుకులను ఒక్కొక్కటిగా నిలిపివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో ఉప్పు, చక్కెర, కారం, బియ్యం, గోధుమపిండి, పామాయిల్, కిరోసిన్, కందిపప్పు.. ఇలా ఎనిమిది రకాల నిత్యావసరాలను చౌకదుకాణాల్లో అందించేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వీటిల్లో కొన్నింటికి సబ్సిడీ ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఆ భారం భరించలేక రాష్ట్ర ప్రభుత్వం వాటిలో ఒక్కొక్కటిగా నిలిపివేసేందుకు సన్నద్ధమవుతోంది. దాదాపు ఐదు నెలల నుంచి కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్, ఉప్పు వంటి వాటిని ఇవ్వకుండా అటకెక్కించింది. ఇప్పుడు చక్కెర, కిరోసిన్‌ కోటానూ నిలిపివేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల నుంచి బియ్యం మాత్రమే!
గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం చక్కెరపై సబ్సిడీ భరించలేమని చెప్పుకొచ్చింది. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని నిర్ణయించింది. అలా భరించలేని రాష్ట్రాలు కోటాలో కోత విధించుకోవచ్చని సూచించింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇదే నియమాన్ని పాటిస్తోంది. చక్కెర, కిరోసిన్‌పై సబ్సిడీ నిలిచిపోవడంతో ఆభారం మోయడం కంటే నిలిపివేయడమే మంచిదని భావిస్తోంది. వచ్చే నెల నుంచి చక్కెర, కిరోసిన్‌ ఆపేసే దిశగా అడుగులు వేస్తోంది.

పేదలపై అదనపు భారం
జిల్లాలో 2,852 చౌకదుకాణాలున్నాయి. వీటి ద్వారా 10,84,333 మంది తెల్ల రేషన్‌ కార్డుదారులకు అర కిలో చోప్పున 4,90,238 కిలోల చక్కెర పంపిణీ చేస్తున్నారు. అలాగే అంత్యోదయ, అన్నపూర్ణ, తెల్ల రేషన్‌ కార్డుదారులకు 16,824 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రతి తెల్లరేషన్‌ కార్డుదారుడికి లీటర్‌ చొప్పున 1,185 లీటర్ల కిరోసిన్‌ పంపిణీ చేస్తున్నారు. చక్కెర, కిరోసిన్‌ నిలిపివేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇకపై వీటిని బహిరంగ మార్కెట్‌లోనే కొనుగోలు చేయాల్సిన దుస్థితి. భారం తడిసిమోపుడవడం ఖాయమని పేదలు భావిస్తున్నారు. ఇదిలావుండగా కొన్ని మండలాల్లో ఈ నెలలోనే కిరోసిన్‌ కోటా ఆపేసినట్టు తెలుస్తోంది.

డీలర్ల ఆందోళన
ప్రభుత్వం రేషన్‌ షాపు ద్వారా పంపిణీ చేసే సరుకులు కుదించేస్తుండడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో సరుకులు ఎక్కువ పంపిణీ చేయడంతో..కమీషన్‌ కూడా బాగా గిట్టుబాటయ్యేదని, ఇప్పుడు కిరోసిన్, చక్కెర నిలిపేస్తే ఎలా అనే మీమాంసలో పడ్డారు. బియ్యమాత్రమే పంపిణీ చేస్తే తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటి సమాచారం లేదు..
కిరోసిన్, చక్కెర నిలివేతపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఈ నెల కోటా పంపిణీ చేస్తాం. దీపం కనెక్షన్లు అందరికీ ఇస్తాం. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement