రసంలో వచ్చిన బల్లి ( అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విద్యార్థులు )
♦ విద్యార్థులకు స్వల్ప అస్వస్థత
♦ వెంటనే ఆస్పత్రికి తరలించిన ఉపాధ్యాయులు
♦ ఆందోళనకు గురైన తల్లిదండ్రులు
వెంకటాచలం : మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన రసం తాగి విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కంటేపల్లి దళితవాడ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. కంటేపల్లి దళితవాడ పాఠశాలలో మొత్తం 38 మంది విద్యార్థులు ఉన్నారు. రోజూలాగే అక్షయ పాత్ర ఏజెన్సీ సరఫరా చేసిన భోజనాన్ని మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించారు. భోజనం చివరలో రసం హాట్‌బాక్సు అడుగున బల్లి చనిపోయి ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు.
అప్పటికే రసంతో 8 మంది విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు రాంమోహన్, ఉపాధ్యాయిని మస్తానమ్మ భోజనం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు ఆందోళనకు గురై మండలాధికారులకు, వెంకటాచలం క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే 108 వాహనం కంటేపల్లికి చేరుకుని రసం తాగిన ఉపాధ్యాయులతో పాటు స్వల్ప అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థులను క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. తహసీల్దార్ సోమ్లానాయక్, ఎంఈఓ కొండయ్యలు క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక
అక్షయపాత్ర ఏజెన్సీ సరఫరా చేసిన రసంలో చనిపోయిన బల్లి కనిపించడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. తహసీల్దార్ సోమ్లానాయక్, ఎంఈఓ కొండయ్య కాకుటూరు పంచాయతీ పరిధిలోని అక్షయపాత్ర ఏజెన్సీ వంటశాలను పరిశీలించి అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థులకు పంపే భోజనం విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.