ఆ నేతల ప్రయాణం ఎందాకా.. | local politics in jaggampeta tdp leaders | Sakshi
Sakshi News home page

ఆ నేతల ప్రయాణం ఎందాకా..

Published Fri, Apr 15 2016 11:15 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

local politics in jaggampeta tdp leaders

   ఒకే పార్టీలో మెట్టప్రాంత నేతలు
   పైకి కలసిన ఎంపీ తోట, ఎమ్మెల్యే జ్యోతుల, ఇన్‌చార్జి చంటిబాబు
   లోలోన రాజకీయ భవిష్యత్ కోసం పైఎత్తులు
   గ్రామస్థాయిలో కేడర్‌లో అయిష్టత
   తామరాడలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల ఘర్షణ
   పోలీసు పికెట్ ఏర్పాటు

 
జగ్గంపేట : రైలు పట్టాలు కలుస్తాయా... ఉత్తర దక్షిణ ధ్రువాలు కలుస్తాయా... అంటే కలువవని చిన్న కుర్రాడయినా చెబుతాడు. ఏపీలో ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ చిన్నకుర్రాడికి సైతం ఉన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో ఎడాపెడా చేర్చుకుంటూ పోతున్నారు. అయితే ఆయన ఇంద్రజలానికి ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారు కానీ వారి అనుచరులు మాత్రం కలవలేకపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్తిపాడులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు మృతి వరుపులకు కాస్త కలిసొచ్చింది. అయితే జగ్గంపేటలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆ నియోజకవర్గంలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి ఒక సారి మంత్రి హోదాను పొందిన తోట నరసింహం ప్రస్తుతం టీడీపీ కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఆయన అనుచరులు నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకునేందుకు చూస్తున్నారు. మరోవైపు టీడీపీ టికెట్‌పై రెండు సార్లు పోటీచేసి ఓటమి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు పార్టీలో సానుభూతితో కేడర్‌ను నిలుపుకుంటూ నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

తాజాగా మెట్టప్రాంతంలో తనకంటూ ప్రత్యేక రాజకీయ శైలి కలిగిన జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే హోదాలో  టీడీపీలో చంద్రబాబు సమక్షంలో చేరారు. దాంతో నియోజకవర్గంలో మూడు వర్గాలయ్యాయి. నేతలు పైకి పెదాలపై చిరునవ్వులను చిందిస్తూ కలిసి ఉన్నామని చెబుతున్నప్పటికీ భవిష్యత్తులో కేడర్‌ను నిలుపుకోకపోతే దెబ్బతింటామని ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ పోతున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో ముగ్గురు నేతలు కలిసి పాల్గొన్నారు. ఎవరి అనుచరులు వారి వెంటే ఉండడం చర్చనీయాంశం అయింది.

గ్రామస్థాయిలో టీడీపీ కార్యకర్తలు కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వారిని కలుపుకునేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దానికి కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గాల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలే అద్దంపడుతున్నాయి.  గతంలో పంచాయతీ భవన నిర్మాణానికి ఎంపీ నరసింహం శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఆ గ్రామ సర్పంచ్, ఎమ్మెల్యే అనుచరుడు తొలగించి లోపల ఏర్పాటు చేయించారు. ఆ శిలాఫలకాన్ని యధాస్థానంలో ఉంచాలని ఎంపీ వర్గం పట్టుపట్టగా పోలీసు స్టేషన్ వరకు వ్యవహారం వెళ్లింది. దాంతో కిర్లంపూడి ఎస్సై బీవీ రమణ ఆధ్వర్యంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement