
స్వాధీనం చేసుకున్న బంగారంతో డీఎస్పీ, సీఐలు
మదనపల్లె: లారీ ఓనర్ దొంగ అవతారం ఎత్తి ఇళ్లలో చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐ నిరంజన్‌కుమార్ గురువారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మ ఇళ్లలో నివాసం ఉంటున్న మహ్మద్ రఫీక్(40)కి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. చిన్నతనం నుంచి లారీ డ్రైవర్. తర్వాత ఓ లారీ కొన్నాడు.
ఈ క్రమంలో జూదం, మద్యం, చెడు వ్యసనాలకు అలవాటు పడి కష్టాల్లోకి కూరుకుపోయాడు. వడ్డీ వ్యాపారులు, బ్యాంకులలో అప్పులు తీర్చేందుకు రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మూడు నెలలుగా పట్టణంలోని పలు వీధులలో అర్ధరాత్రిళ్లు 13 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బంగారు ఆభరణాలను స్థానిక బంగారు దుకాణాలలో రూ.12 లక్షలకు తాకట్టు పెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీఐ నిరంజన్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్‌ఐలు సుకుమార్, దస్తగిరి, సిబ్బంది శంకర, రాజేష్, శ్రీనివాస్ తదితరులు చాకచక్యంగా స్థానిక చిత్తూరు బస్టాండులో మహ్మద్‌రఫీక్‌ను అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు. ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందికి డీఎస్పీ నగదు రివార్డు అందజేశారు.
ఫోటోలు ఉన్నాయి.