పలమనేరులోని ఏటీఎం సర్కల్‌లో రిలే దీక్ష చేస్తున్న వామపక్ష కార్యకర్తలు
పలమనేరు:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్రజలను ముంచేశాయని స్థానిక సీపీఎం, సీపీఐ డివిజనల్ కన్వీనర్లు ఓబుల్‌రాజు, చెన్నకేశవులు విమర్శించారు. వామపక్షపార్టీల పిలుపు మేరకు పట్టణంలోని ఏటీఎం సర్కిల్‌లో శుక్రవారం ఈ రెండు పార్టీల ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కుదరదని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పినా సీఎం కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేదంటే వీరి కుమ్ముక్కు అర్థమైందన్నారు. హోదాకి బదులు తమకు ప్యాకేజీలు కావాలని వారు మాట్లాడడం ఘోరమన్నారు. బీజేపీతో జతకట్టిన టీడీపీకి కేంద్రాన్ని నిలదీసే దమ్ములేదన్నారు. కేంద్రం, రాష్ట్రం ప్రత్యేకహోదా విషయంలో డ్రామా ఆడుతున్నాయన్నారు. ఈ నిరసనలో వామపక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాల కార్యకర్తలుపాల్గొన్నారు.