బి.కొత్తకోట(చిత్తూరు): ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రెండురోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఏప్రిల్ చివరి వరకు సాధారణం కంటే అధికంగా 35 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేవు. ఇది పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపించింది.
శుక్రవారం నుంచి హార్సిలీహిల్స్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు 20నుంచి 25 డిగ్రీలకు పడిపోయాయి. గత నెలలో రాత్రివేళ 25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండగా ప్రస్తుతం 10 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో కొండపై చలి మొదలైంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. మేఘాలు కొండపై తేలియాడుతున్నాయి. ఆహ్లదకరమైన వాతావరణం పర్యాటకులను పరవశింపజేస్తోంది. శనివారం కొండపై చిరుజల్లులతో కూడిన వర్షం కురవగా గాలిబండపై పర్యాటకులు తడిసి ముద్దయ్యారు.