horsely hills
-
హార్స్లీ హిల్స్ వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హార్స్లీ హిల్స్‌లోని మూలమలుపు వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పది మందికి తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రులను మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివాహర యాత్ర నుంచి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాధితులు వెదురుకుప్పం మండలం చౌటపల్లి గ్రామ వాసులని సమాచారం. -
పర్యాటక కేంద్రాలుగా హార్సిలీహిల్స్, తిరుపతి
సాక్షి, చిత్తూరు : జిల్లాలో హార్సిలీహిల్స్, తిరుపతిని ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని జిల్లా పర్యాటకశాఖ అధికారి డీవీ చంద్రమౌళిరెడ్డి చెప్పారు. మంగళవారం హార్సిలీహిల్స్ వచ్చిన ఆయన రెవెన్యూశాఖ టూరిజానికి కేటాయించిన 10.50 ఎకరాల భూమి పత్రాన్ని వీఆర్ఓ ఖాదర్‌బాషా నుంచి స్వీకరించారు. ఆయన విలేకరులతో మా ట్లాడుతూ హార్సిలీకొండపై ఇప్పటికే ఉన్న మూడెకరాలు కలుపుకుంటే ఇప్పుడు 13.50 ఎకరాలుందన్నారు. ఇందులో రిసార్ట్స్ ని ర్మించి అభివృద్ధి చేయాలన్నది సీఎం ఆలోచనగా చెప్పారు. (నేడు శ్రీవారికి సీఎం పట్టువ్రస్తాల సమర్పణ) స్టార్ హోటళ్ల తరహా సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందనున్నట్టు చెప్పారు. తిరుపతిలో పర్యాటక అభివృద్ధి కోసం 15 నుంచి 20 ఎకరాలు కావాలని రెవెన్యూ అధికారులను కోరామన్నారు. కైలాసగిరి తరహాలో పార్కును అభివృద్ధి చేయడంతో పలు కార్యక్రమాల నిర్వహణ కోసం భూ కేటాయింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. పర్యాటకశాఖతో అనుబంధంగా ప్రయివేటు హోటళ్లు, పర్యాటక స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్పందన లభిస్తోందని చెప్పారు. శాఖ వెబ్సైట్లో ప్రైవేటు వివరాలను ఉంచుతామన్నారు. -
హార్సిలీహిల్స్‌లో 2 కె రన్
బి.కొత్తకోట: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పర్యాట కేంద్రం హార్సిలీహిల్స్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టూరిజం మేనేజర్ మురళి ఆధ్వర్యంలో టూరిజం, రెవెన్యూ, అటవీ, రైల్వే, పోలీసుశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది 2 కె రన్లో పాల్గొన్నారు. గవర్నర్ బంగ్లా ప్రవేశ ద్వారం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వశాఖకు చెందిన సిబ్బంది, అధికారులతో ప్రైవేటు హోటళ్లు, అతిథి గృహాల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నాను. -
హార్సిలీ హిల్స్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
బి.కొత్తకోట(చిత్తూరు): ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రెండురోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఏప్రిల్ చివరి వరకు సాధారణం కంటే అధికంగా 35 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేవు. ఇది పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపించింది. శుక్రవారం నుంచి హార్సిలీహిల్స్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు 20నుంచి 25 డిగ్రీలకు పడిపోయాయి. గత నెలలో రాత్రివేళ 25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండగా ప్రస్తుతం 10 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో కొండపై చలి మొదలైంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. మేఘాలు కొండపై తేలియాడుతున్నాయి. ఆహ్లదకరమైన వాతావరణం పర్యాటకులను పరవశింపజేస్తోంది. శనివారం కొండపై చిరుజల్లులతో కూడిన వర్షం కురవగా గాలిబండపై పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. -
మూగవేదన
పర్యాటక కేంద్రం చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్‌లోని జంతు ప్రదర్శన శాలలో కుందేళ్లు మూగగా రోదిస్తున్నాయి. వాటిని సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఈ దుస్థితి దాపురించింది. వ్యాధి బారినపడిన ఒక మూగజీవికి సరైన చికిత్సలు అందించలేదు. ఫలితంగా దాదాపు 40 కుందేళ్లకు వ్యాధి వ్యాపించింది. మూడు నెలలుగా ఇవి చర్మ వ్యాధితో బాధపడుతున్నాయి. బి.కొత్తకోట:చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్‌లో పర్యావరణ సముదాయాన్ని అటవీశాఖ పర్యవేక్షిస్తోంది. ఇందులో వన్యప్రాణులు, జంతువులు, పక్షులతో కూడిన జంతుప్రదర్శనశాల కొనసాగుతోంది. వీటి సంరక్షణ బాధ్యత అటవీశాఖదే. ఇందులోనే 40 నుంచి 50 కుందేళ్లు ఉన్నాయి. తొలుత ఓ కుందేలుకు మూతిపై పుండ్లు ఏర్పడ్డాయి. ఈ వ్యాధి ఒకదానికొకటిగా వ్యాపిస్తూ మిగిలిన వాటికీ సోకింది. విషయాన్ని గుర్తించిన అటవీ సిబ్బంది బి.కొత్తకోట పశువైద్యాధికారి వెంకటరెడ్డిని సంప్రదించారు. ఇది చర్మవ్యాధిగా ఆయన నిర్ధారించారు. కొన్ని మందులు, సూదులు సూచించారు. చికిత్సలకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో మదనపల్లె ఏడీ రమేష్ ను సంప్రదించాలని కోరారు. దీనిపై అటవీ సిబ్బంది ఓ కుందేలును తీసుకుని ఏడీ వద్దకు వెళ్లారు. పరిశీలించిన ఏడీ ఐవర్ మెక్టీన్ అనే సూదిమందు పుండ్లున్న చోట పూసేందుకు ఆయింట్మెంట్లను సూచించారు. ఇది జరిగి నెల కావస్తోంది. అప్పటి నుంచి ఆయింట్మెంట్ ఇస్తున్న అటవీ సిబ్బంది సూదిమందు వేయించలేదు. దీంతో కుందేళ్లకు వ్యాధి విస్తరిస్తూ పోతోంది. వ్యాధి తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. ప్రస్తుతం కుందేళ్ల ము ఖంపై పుండ్లతో ఇబ్బందులు పడుతున్నాయి. దీనిపై పశువైద్యాధికారి వెంకటరెడ్డి మాట్లాడుతూ చిన్నిచిన్న పురుగుల కారణంగా వ్యాధి వస్తుందని చెప్పారు. హార్సిలీహిల్స్‌లోని కుందేళ్లకు చికిత్సను చెప్పామని అన్నారు. మదనపల్లె ఏడీ రమేష్ మాట్లాడుతూ తన వద్దకు ఓ కుందేలును తెచ్చి చూపించారని, దానికి సూదిమందు చెప్పానని వేయించారో లేదో తెలియదని చెప్పారు. అటవీశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ డాక్టర్లు సూచించిన ఆయింట్మెంట్ రాస్తున్నామని చెప్పారు. సూది మందు వేసేందుకు అన్నింటినీ మదనపల్లెకు తీసుకుపోలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పశువైద్యసిబ్బంది రావడంలో జాప్యం జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.